జీవ వైవిధ్య పరిరక్షణ అందరి బాధ్యత సాంప్రదాయ వ్యవసాయమే పర్యావరణానికి మేలు

ప్రధాని మన్మోహన్‌సింగ్‌
హైదరాబాద్‌, అక్టోబర్‌ 16 (జనంసాక్షి) : భారత్‌ సహజ సిద్దంగానే జీవవైవిధ్యాన్ని పుణికి పుచ్చుకొని కాపాడుతూ వస్తోందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. భారత్‌ జీవన విధానంలోనే పర్యావరణ పరిరక్షణ ఇమిడి ఉందని సగర్వంగా చాటారు. జీవవైవిధ్య సదస్సులో ప్రధాని కీలక ఉపన్యాసం చేశారు. వ్యవసాయిక దేశమైన భారత్‌ పర్యావరణ పరిరక్షణలో అనాది కాలంగా కృషి చేస్తూ వస్తోందని అన్నారు. వేల ఏళ్ళుగా ఈ సూత్రం ఆధారంగానే భారత్‌ తన జీవన యాత్ర కొనసాగిస్తోందని చెప్పుకొచ్చారు. జీవవైవిధ్యానికి ప్రపంచమంతా కలిసికట్టుగా నడవాలని ప్రధాని సూచించారు. భారత జీవన విధానంలోనే జీవవైవిధ్యం ఇమిడి వుందన్న ఆయన జీవ వైవిధ్య పరిరక్షణకు నిధుల సవిూకరణ, మానవ వనరులు కూడా ముఖ్యమేనన్నారు. భారత సంప్రదాయ వ్యవసాయంలో ప్రకృతి పరిరక్షణ ఉందన్నారు. భారత సంప్రదాయ విజ్ఞానం ప్రపంచ మానవాళికి

వినియోగపడాలని ప్రధాని ఆకాంక్షించారు. సంప్రదాయ పంటల పరిరక్షణను ఉద్యమంగా చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. భారత సంప్రదాయ విజ్ఞానంపై ప్రైవేటు కంపెనీల గుత్తాధిపత్యానికి భారత్‌ వ్యతిరేకమని ప్రధాని స్పష్టం చేశారు. దాదాపు 105 పేటెంట్లపై భారత్‌ విజయం సాధించిందని ప్రధాని సదస్సులో పేర్కొన్నారు. భారత్‌ చేపట్టిన పరిరక్షణ కార్యక్రమంతో పులుల సంఖ్య అంచనాకన్నా అధికంగా పెరిగిందని మన్మోహన్‌ సింగ్‌ గుర్తు చేశారు. జీవ వైవిధ్య పరిరక్షణ గ్రావిూణ ప్రాంత ఉపాధి అవకాశాలను పెంచుతోందని ప్రధాని తెలియజేశారు. నగోయా ప్రొటోకాల్‌ని అమలులోకి తెచ్చి ప్రపంచానికి భారత్‌ ఆదర్శంగా నిలిచిందని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. ఆయన నగరంలో జరుగుతున్న జీవవైవిధ్య సదస్సులో పాల్గొనడానికి ఢిల్లీ నుంచి ఈరోజు మధ్యాహ్నం హైదరాబాదు వచ్చిన సంగతి తెలిసిందే.

జీవవైవిధ్య స్తూపాన్ని ఆవిష్కరించిన ప్రధాని

నగరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జీవవైవిధ్య సదస్సుకు గుర్తుగా నిర్మించిన జీవవైవిధ్య స్తూపాన్ని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు.   రాయదుర్గం ప్రాంతంలో ప్రభుత్వం ఈ స్తూపాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇది సూర్యుని కాలగమనాన్ని ఇతర సిద్దాంతాలను మేళవిస్తు నిర్మితమయింది.

జీవవైవిధ్య పరిరక్షణకు సహకరించాలి: అచిమ్‌ స్టేనర్‌

జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలకు ఐక్యరాజ్యసమితి సహకరిస్తుందని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అచిమ్‌ స్టేనర్‌ అన్నారు. జీవవైవిధ్య పరిరక్షణకు సమితి నిరంతరం కృషిచేస్తోందని, ప్రపంచ దేశాలు మాత్రం తగినన్ని ప్రోత్సాహకాలు కల్పించడం లేదని ఆయన అన్నారు. జీవవైవిధ్య పరిరక్షణకోసం నిధుల సవిూకరణకు అన్ని దేశాలు సహకరించాలని ఆయన కోరారు. పర్యావరణ అభివృద్ధికి ఆర్థిక సామర్థ్యం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.  జీవ వైవిధ్య మనుగడకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. జీవ వైవిధ్య పరిరక్షణకు మనం ఇచ్చిన హావిూలను నిలబెట్టుకోవాలని, నగోయా ప్రోటోకాల్‌ అమలుకు కృషి చేయాలని ఆయన సూచించారు. భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పాల్గొన్న జీవ వైవిధ్య సదస్సు ప్రత్యేక సమావేశంలో ఆయన ప్రసంగించారు.