జులై 11నుంచి నిలిచిపోనున్న రైళ్లు
దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ జులై 11 నుంచి రైల్వే కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘం రైల్వే జీఎంకు సమ్మె నోటీసు అందజేశారు. కార్మికుల సమ్మెతో రైళ్లకు బ్రేక్ పడనుంది.కొత్త పెన్షన్ స్కీమ్ పై రివ్యూ , ఏడవ వేతన కమిషన్ సిఫారసుల అమలు వంటి పలు డిమాండ్ లతో రైల్వే యూనియన్లు ఈ నిరవధిక బంద్ చేపట్టనున్నాయి. అన్ని జోనల్ రైల్వేస్ జీఎంలకు, ప్రొడక్షన్ యూనిట్లకు ఇవాళ నిరవధిక సమ్మె నోటీసులు అందనున్నాయి. ఈ నోటీసు ప్రకారం జూలై 11 ఉదయం 6గంటలనుంచి 13లక్షల మంది రైల్వే వర్కర్లు సమ్మె పాటించనున్నారని ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్(ఏఐఆర్ఎఫ్) జనరల్ సెక్రటరీ ఎస్ గోపాల్ మిశ్రా తెలిపారు. ఏడవ వేతన సిఫారసు మేరకు కనీస వేతనం రూ.18,000 నుంచి రూ.26,000 కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. నిరవధిక సమ్మె కాలంలో ఎలాంటి రైళ్లు పట్టాలపై నడవబోవని స్పష్టం చేశారు.