టీడీపీ అండతో వీగిన అవిశ్వాసం

అనుకూలంగా : 58
వ్యతిరేకంగా : 142
తటస్థం : 64
జంప్‌జిలానీలు
కాంగ్రెస్‌ : 9
టీఆర్‌ఎస్‌ ప్రతిపాదించిన అవిశ్వాసానికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గొట్టెపాటి రవి, జోగి రమేశ్‌, చింతలపూడి రాజేశ్‌, ఆళ్ల నాని, బి. శివప్రసాద్‌, ఆళ్ల నాని, సుజయ్‌ కృష్ణరంగారావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని ఓటు వేశారు.
టీడీపీ : 6
టీడీపీకి చెందిన కొడాలి నాని, వనిత, అమరనాథ్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌, బాలనాగిరెడ్డి, సాయిరాజ్‌, మద్దతుగా ఓటు వేశారు. వీరు పార్టీ విప్‌కు దిక్కరించి ఓటింగ్‌లో పాల్గొన్నారు. కొప్పుల హరీశ్వర్‌రెడ్డి గైర్హాజరయ్యారు
– మద్దతుగా నిలిచిన టీఆర్‌ఎస్‌, వైఎస్సార్‌ సీపీ, సీపీఐ, సీపీఎం, బీజేపీ, లోక్‌సత్తా
– డివిజన్‌ పద్ధతిలో ఓటింగ్‌
హైదరాబాద్‌, మార్చి 15 (జనంసాక్షి) : ప్రధాన ప్రతిపక్షం అండతో ప్రభుత్వం అవిశ్వాస గండం నుంచి గట్టెక్కింది. టీడీపీ ముందుగా చెప్పినట్లే అవిశ్వాసానికి దూరంగా ఉంది. కానీ ఆ పార్టీకి చెందిన ఆరుగురు రెబల్‌ ఎమ్మెల్యేలు సైకిల్‌ దిగి వైఎస్సార్‌ పీసీ పక్షాన అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారు. అధికార కాంగ్రెస్‌తో కొంతకాలంగా అంటీముట్టనట్లు ఉంటూ, వైఎస్సార్‌ సీపీతో అంటకాగుతున్న తొమ్మిది మంది ఎమ్మెల్యేలు సొంతపార్టీకి షాకిచ్చారు. టీఆర్‌ఎస్‌ ప్రతిపాదించిన అవిశ్వాసం తీర్మాణంపై ఉదయం అర్ధరాత్రి వరకు చర్చోపచర్చలు జరిగాయి. ఓ దశలో తీవ్రస్థాయిలో అధికా రపక్షానికి, టీఆర్‌ఎస్‌, వైఎస్సార్‌పీసీ వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణ వెనుకబాటు తనం, విద్యుత్‌ పంపిణీ, విద్యాసంస్థల ఏర్పాటులో వివక్ష, తెలంగాణకు జరగుతున్న అన్యాయంపై టీఆర్‌ఎస్‌ పక్షాన ఈటెల రాజేందర్‌, హరీశ్‌రావు, కేటీఆర్‌ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వం పక్షాన ఆరోపణలను ఖండించారు. వైఎస్సార్‌ సీపీపై, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒక దశలో వారి పరస్పర ఆరోపణలతో సభ దద్దరిల్లింది. ప్రతిపక్షాలు సభ దృష్టికి తీసుకువచ్చిన అంశాలపై ముఖ్యమంత్రి రెండు గంటల పాటు సమాధానమిచ్చారు. అనంతరం రాత్రి ఒంటిగంటకు డివిజన్‌ పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహించారు. అవిశ్వాసం ప్రవేశపెట్టిన టీఆర్‌ఎస్‌తో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, సీపీఐ, బీజేపీ, సీపీఎం, లోక్‌సత్తా అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, టీడీపీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు అవిశ్వాసానికి మద్దతుగా నిలిచారు. అవిశ్వాసానికి అనుకూలంగా 58 మంది, వ్యతిరేకంగా 142 మంది, టీడీపీకి చెందిన 64 మంది తటస్థంగా వ్యవహరించారు. రాత్రి 1:45 గంటలకు అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. సభను శనివారం ఉదయం 9 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు.