తీరు మారని గవర్నర్
` నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల పేర్లు తిరస్కరణ
హైదరాబాద్(జనంసాక్షి): గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చారు. మంత్రి మండలి సిఫారసు చేసిన నామినేటెడ్ ఎమ్మెల్సీల పేర్లను తిరస్కరించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కింద దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల అభ్యర్థిత్వాలను ఆమోదించాల్సిందిగా కోరగా.. ఆ సిఫారసులను తమిళిసై రిజెక్ట్ చేశారు. సర్వీస్ సెక్టార్‌లో వీరు ఎలాంటి సేవలు చేయలేదని.. ఈ కోటా కింద వీరిని నామినేట్ చేయడం కుదరదని స్పష్టం చేశారు. సాహిత్యం, శాస్త్ర సాంకేతిక రంగం, కళలు, సహకార ఉద్యమం, సామాజిక సేవలో ఈ ఇద్దరికి ఎలాంటి ప్రత్యేకతలు లేవని.. ఆర్టికల్ 171(5) అర్హతలు సరిపోవని తమిళిసై పేర్కొన్నారు. నామినేటెడ్ కోటా కింద ఎమ్మెల్సీకి తగిన అర్హతలు లేవని తెలిపారు. తగిన అర్హతలు లేకుండా నామినేట్ చేయడం తగదన్న గవర్నర్.. అర్హతలు ఉన్న ఎంతో మంది ప్రముఖులు రాష్ట్రంలో ఉన్నారని.. అర్హులను పరిగణలోకి తీసుకోకుండా రాజకీయాలతో సంబంధం ఉన్న వారి పేర్లు సిఫారసు చేయడం తగదని హితవు పలికారు. ఎమ్మెల్సీలుగా ఎవరిని నామినేట్ చేయకూడదో ప్రజాప్రాతినిథ్య చట్టంలో స్పష్టంగా ఉందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రస్తుతం సిఫారసు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అనర్హత కిందకు రారని చెప్పేలా.. ఇంటెలిజెన్స్ సహా ఏ ఇతర సంస్థల నివేదికలు లేవని తెలిపారు. మంత్రివర్గ సిఫారసుతో అన్ని అంశాలను జత చేయలేదన్నారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి పేర్లను ఆమోదిస్తే ఆయా రంగాల్లో ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం ఉన్న వారికి గుర్తింపు లభించబోదన్న ఆమె.. సరైన వ్యక్తులకు అవకాశాలు నిరాకరించినట్లవుతుందని వ్యాఖ్యానించారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వారి పేర్లను తిరస్కరించాలని మంత్రి మండలి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సూచించారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారికి రాసిన లేఖలో గవర్నర్ తమిళిసై వివరణ ఇచ్చారు. పాడి కౌశిక్‌రెడ్డి విషయంలోనూ ఇలాగే..: గతంలోనూ ప్రస్తుత ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి విషయంలో గవర్నర్ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. శాసనమండలి గవర్నర్ కోటాలో హుజూరాబాద్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీ స్థానానికి మంత్రి మండలి ఎంపిక చేసి.. ఆమోదం కోసం గవర్నర్‌కు సిఫారసు చేసింది. అయితే ఈ సిఫారసునూ తమిళిసై తిరస్కరించారు. అనంతరం ఎమ్మెల్యే కోటా కింద కౌశిక్‌రెడ్డిని నామినేట్ చేయగా.. ఆమోదం తెలిపారు. కరీంనగర్ జిల్లాకు చెందిన కౌశిక్ రెడ్డి క్రికెట్ క్రీడాకారుడు. 2018లో కాంగ్రెస్‌లో చేరి, హుజూరాబాద్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. బీఆర్‌ఎస్‌లో చేరారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ.. ఆ స్థానాన్ని బీసీకి ఇవ్వాలని నిర్ణయించడంతో కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు.