తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నిప్పురవ్వ… చిట్యాల (చాకలి)ఐలమ్మ…

 

వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ డీజీ నర్సింహారావు…

కూకట్ పల్లి (జనంసాక్షి ):భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో దున్నే వాడికే భూమి కావాలని నినదించిన సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నరసింహారావు కొనియాడారు. బాలానగర్ మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి సందర్బంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నర్సింహారావు, మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి. సత్యం ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా డీజీ నరసింహారావు మాట్లాడుతూ చిట్యాల ఐలమ్మ తెలంగాణ నైజాం సంస్థానంలో భూ పోరాటాలకు ఊపునిచ్చిందని, పోరాటాలు విస్తృత సమయంలో అజ్ఞాతంలో ఉన్న నాయకులకు అన్నం ని గంపల్లో తీసుకెళితే పోలీసులు పట్టుకుంటారని చాకలి బట్టల మూటల్లో తీసుకెళ్ళి కమ్యూనిస్టు దళాలకు పెట్టిన ధైర్య సాహసాలే ఐలమ్మ ఊపిరని అన్నారు. ఐలమ్మ చేపట్టిన భూ వివాదంలో ఓటమి పాలైన దేశ్ ముఖ్ ఇసునూరు రామచంద్రారెడ్డి పాలకుర్తిపై అనేకసార్లు దాడులు జరిపించాడని, దొర పోలీసులతో ఐలమ్మ ఇంటికొచ్చి కమ్యూనిస్టులకు ఎందుకు సాయం చేస్తున్నావని ప్రశ్నించినా ఐలమ్మ ఏమాత్రం బెదరకుండా రోకలి బండను అందుకోవడంతో దొర తోక ముడిచిన వైనాన్ని తెలిపారు. నైజాం తొత్తు, మధ్య యుగాల భూస్వామ్య వ్యవస్థ ప్రతినిధి, నరరూప రాక్షసుడైన విసునూరు దేశముఖ్ ను ఎదిరించిన మట్టి మనిషి వీరనారి ఐలమ్మ ‘నీ కాళ్ళు మొక్కుత దొరా! నీ బాంచెన్ దొరా!” అన్న తెలంగాణ రైతు కూలీ బిడ్డలే ఆ దొరలకు వ్యతిరేకంగా గుత్పలు, వడిసెలు, తుపాకులతో తిరగబడ్డారు.ఐలమ్మ ఆ మహత్తర తిరుగుబాటుకు స్పూర్తి సంకేతమై ఆంధ్ర మహాసభ నాయకత్వంలో ఎర్రజెండా పట్టి పోరాడిందన్నారు. పంటను,భూమిని దక్కించుకుని దొరల నెదిరిస్తే కష్టాలు తప్పవని, ప్రాణాలు తీస్తారని ఆమెకు తెలుసినా లొంగి బతకడం కన్నా పోరాడి మరణించటమే మేలనుకుని దుర్మార్గుడైన ఇసునూరు రామచంద్రారెడ్డి 40 వేల ఎకరాల ఆసామీ,60 గ్రామాలకు అధిపతిగా నైజాంకు నమ్మినబంటైన ఇతని కొడుకు బాబుదొర (జగన్మోహన్ రెడ్డి) దుర్మార్గాలకు,ఆగడాలకు అంతులేదని, చాకలి,మంగలి, గౌడ చేతివృత్తుల వారు,రైతులు, కూలీలు వారి పీడనలో పీల్చి పిప్పి చేయబడ్డారని తెలిపారు. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేదని, నైజాం రాజు, రజాకార్ల నాయకుడు ఖాశీం రజ్వీ, భూస్వాముల, అధికారాలకు, దుర్మార్గాలకు, వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ విరనారి ఐలమ్మ స్పూర్తితో మహిళలు,ప్రజలు, కార్మికులు అందరు ముందుకు సాగాలని, ఆమె ఆశయ సాధన కోసం కృషి చేయాలని,కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చరిత్రను వక్రీకరిస్తుందని తీవ్రంగా ఖండించారు. కమ్యూనిస్టు కార్యకర్తలు 4000 మంది అమరులయ్యారని, ఏ పాత్ర లేని బీజేపీ నేతలు చరిత్రను వక్రీకరిస్తున్నారని దీని ఫలితంగా ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ బాలానగర్ మండల కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్, సాయి ప్రసాద్, శ్రీనివాస్, భాస్కర్, మంగ, రఘు, శివ, వనిత, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.