నాగార్జునసాగర్‌ వద్ద ఉద్రిక్తత

బలవంతంగా నీటిని విడుదల చేసుకున్న ఎపి అధికారులు
ఇరువైపులా మొహరించిన పోలీసులు
ఇదంతా కెసిఆర్‌ కుట్ర అన్న కోమటిరెడ్డి
రాజకీయనాయకులు స్పందించవద్దన్న వికాస్‌ రాజ్‌
నల్గొండ,నవంబర్‌30 (జనంసాక్షి): నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. ప్రాజెక్ట్‌ 26 గేట్లలో చెరో 13 గేట్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ముళ్ళ కంచె, టెంట్లు వేసుకుని బందోబస్తు నిర్వహించారు. ఏపీ వైపు వాహనాలకు రాకుండా ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి. తాత్కాలిక విద్యుత్‌తో ఏపీ అధికారులు దౌర్జన్యంగా కుడి కాల్వకు నీటిని విడుదల చేసుకున్నారు. 5వ గేటు ద్వారా గంటకు 500 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల జరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రెండు రోజుల్లో ప్రాజెక్ట్‌ డెడ్‌ స్టోరేజ్‌కు చేరుకునే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ ఆయకట్టు రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు దగ్గర గురువారం తెల్లవారురaామున ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్దకు వచ్చి నీటి విడుదలకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా బుధవారం అర్ధరాత్రి దాటాక అక్రమంగా ప్రాజెక్టులోనికి చొరబడి డ్యామ్‌కు ముళ్లకంచె పెట్టారు. సాగర్‌ ప్రాజెక్టుకు ఉన్న 26 గేట్లలో సగ భాగం.. అంటే 13వ గేట్‌ వరకు ప్రాజెక్టు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసులు వాదిస్తున్నారు. నీటిపారుదల శాఖకు చెందిన ఉన్నతాధికారులు దాదాపు 500 మంది దాకా పోలీసు సిబ్బందితో నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్దకు వచ్చారు. వారిని డ్యామ్‌ కు కాపలాగా ఉన్న స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ సిబ్బందిపై దాడి చేసి.. వారి మొబైల్‌ ఫోన్లు కూడా లాక్కున్నారు. 13వ గేట్‌ వద్దకు చేరుకొని ముళ్ల కంచె పెట్టి.. డ్యామ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.. ఏపీ పోలీసులు.
సాగర్‌ నుంచి నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్దమయ్యారు. పల్నాడు జిల్లాలో భారీగా మోహరించి రాత్రి సమయంలో సాగర్‌ కు వెళ్లారు. సాగర్‌ వద్ద విూడియాపై పల్నాడు ఎస్పీ రవిశంకర్‌ రెడ్డి జులుం ప్రదర్శించారు. విూడియా ప్రతినిధుల ఫోన్లు కూడా ఏపీ పోలీసులు లాక్కున్నారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఏపీ పోలీసులు వెళ్లడంపై ఉత్కంఠ నెలకొని ఉంది. సాగర్‌ డ్యాంపై పోలీసుల హడావిడిపై కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి స్పందించారు. సాగర్‌ డ్యాంపై పోలీసుల డ్రామా కేసీఆర్‌ పనే అని
విమర్శించారు. ఓడిపోతున్నారని కేసీఆర్‌ కి అర్థమై  తెలంగాణ సెంటిమెంట్‌ రగిలిస్తున్నారని ఆరోపించారు. ఇన్ని రోజులు లేని హడావిడి పోలింగ్‌ రోజే ఎందుకు అవుతోందని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఏపీ పోలీసులు కలిసి చేసే డ్రామాలు ఎవరూ నమ్మవద్దని కోరారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్‌ ఎన్నికల కోసం వాడుతున్నారు. కాంగ్రెస్‌ గెలుపును ఎవరూ ఆపలేరని.. 90 సీట్లతో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని కోమటిరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్‌ డ్యాం వద్ద జరుగుతున్న హైటెన్షన్‌ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వికాస్‌ రాజ్‌ స్పందించారు. రాజకీయ నేతలు ఎవరూ ఆ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని అన్నారు. డ్యాం దగ్గర జరుగుతున్న వ్యవహారాన్ని పోలీసులు చూసుకుంటారని చెప్పారు.