భూ బదలాయింపు విధానంలో సడలింపులు

న్యూఢిల్లీ: ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్య విధానంలో చేపట్టిన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుల్లో పనులు నిలిచిపోతుండడం పట్ల ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గురువారం భూ బదలాయింపు విధానంలో సడలింపులకు తన ఆమోదం తెలియజేశారు. తాజా నిర్ణయంతో ఈ నెల నుంచే రహదారులు, రైల్వేలు, పౌర విమానయానం, మెట్రో రైలు, ఓడ రేవులు. వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగం పుంజుకుంటాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వంలో ఒక విభాగం నుంచి మరో విభాగానికి తప్ప ప్రైవేట్‌ సంస్థలకు సర్కారు భూమి బదలాయింపుపై గతేడాది నిషేదం విధించారు. ఏదైనా సంస్థకు భూమిని లీజుకు, అద్దెకు ఇవ్వాలన్నా కచ్చితంగా మంత్రివర్గం నుంచి ఆమోదం పొందాలనే నిబంధనను అమల్లోకి తెచ్చారు. పీపీపీ అనుమతి కమిటీ లేదా ఆర్ధికశాఖ లేదా కేంద్ర కేబినెట్‌ భూ బదలాయింపునకు ఆమోదం తెలుపుతాయి. రైల్వే స్థలాల అభివృద్ధికి రైల్వేల సవరణ చట్టం-2005 ప్రకారం భూమి అప్పగిస్తారు.