రాయలసీమ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉంది : బైరెడ్డి

పీలేరు: రాయలసీమతోనే విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుందని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి విద్యుర్థులకు పిలుపు ఇచ్చారు. చిత్తూరు జిల్లా పీలేరులో మంగళవారం నిర్వహించిన విద్యార్థుల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు స్థానిక నాలుగు రోడ్ల మలుపు నుంచి ఆర్యవైశ్య కల్యాణ మండపం వరకూ ర్యాలీ నిర్వహించారు. రాయలసీమ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందని, అందరూ ఒక్కతాటిపై నిలిచి తెలంగాణా వాదులను నిలదీయాలని పిలుపునిచ్చారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇక్కడి ప్రజలు ఉపాధి కరవై బెంగళూరుకు వలసలు వెళ్తున్నారని, నిరుద్యోగ సమస్య తీవ్రమైందని, పరిశ్రమలు మూతపడి ప్రజలు దారిద్య్రంలో మగ్గుతున్నారని వాపోయారు. అన్ని వనరలు తరిగిపోయి రాయలసీమ ప్రపంచంలోనే పేదరిక ప్రాంతంగా మారిందని వెల్లడించారు. తెలంగాణాలో సీపీఐకి పట్టుందని, దాన్ని నిలుపుకునేందుకే ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలంగాణా గానం చేస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాదులో సమావేశం ఏర్పాటుచేస్తే తనపై ఆకారణంగా కేసులు నమోదు చేశారని ఆరోపించిన ఆయన అలాంటి వాటికి భయపడనని హెచ్చరించారు.