సుప్రీంలో మాయావతికి ఊరట

సాక్ష్యాధారాలు లేవని అక్రమాస్తుల కేసు కొట్టివేత
న్యూఢిల్లీ, జూలై 6 (జనంసాక్షి):
ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్య మంత్రి, బిఎస్పీ ఛీఫ్‌ మాయా వతికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అక్రమా స్తుల కేసులో ఆమెకు వ్యతిరేకం గా ఏ విధమైన సాక్ష్యాధారాలు లేవని చెబుతూ కేసును శుక్రవారం నాడు సుప్రీం కోర్టు కొట్టేసింది. తమ నుంచి ఏ విధమైన ఆదేశాలు లేనందున మాయావతిపై అక్రమాస్తుల కేసును సిబిఐ నమోదు చేయాల్సింది కాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఎనిమిదేళ్ల క్రితం దాఖలు చేశారు. రాజకీయ వేధింపుల్లో భాగంగానే తనపై అక్రమాస్తుల కేసు బనాయించారని ఆమె వాదించారు. మాయవతి అక్రమాస్తుల కేసును విచారించిన పి. సదాశివం నేతృత్వంలోని సుప్రీంకోర్ట్టు బెంచ్‌ తీర్పును రిజర్వ్‌ చేస్తూ మే 1వ తేదీన ఆదేశాలు ఇచ్చింది. తన ఆదాయ మార్గం సక్రమమేనంటూ ఆదాయం పన్ను ట్రిబ్యునల్‌ వెలువరించిన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోవాలని, వాటిని ఢిల్లీ హైకోర్టు కూడా సమర్థించిందని మాయావతి సుప్రీంకోర్టుకు తెలిపారు. మాయావతి అక్రమంగా సంపదను పోగు చేసుకున్నారని నిరూపించడానికి తగిన ఆధారాలను సిబిఐ చూపించలేకపోయిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పార్టీ కార్యకర్తల నుంచి డబ్బును విరాళంగా పొందినట్లు మాయావతి తెలిపారు. మాయావతి ప్రకటించిన ఆస్తుల విలువ 2003లో కోటి రూపాయలు కాగా, 2007 నాటికి అది 50 కోట్ల రూపాయలకు పెరిగిందని సిబిఐ చెప్పింది.

తాజావార్తలు