అండమాన్‌లో.. అమెరికా పర్యాటకుడి దారుణహత్య
పోర్ట్‌బ్లెయర్, నవంబర్21(జనంసాక్షి) : అండమాన్ నికోబార్ దీవుల్లోని సెంటినెలీస్ ద్వీపానికి వెళ్లిన ఓ అమెరికా పర్యాకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సాహస యాత్ర నిమిత్తం అండమాన్ నికోబార్ దీవులకు వచ్చిన ఓ అమెరికా పర్యాటకున్ని నార్త్ సెంటినెల్ ద్వీపంలో సెంటినెలీస్ తెగకు చెందిన కొందరు వ్యక్తులు ఆ పర్యాటకుడిపై దాడి చేసి అతి కిరాతకంగా చంపేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన జాన్ అలెన్ చౌ సాహస యాత్రలో భాగంగా ఇటీవల అండమాన్‌కు వెళ్లాడు. సెంటినెలీస్ తెగ ప్రజలను కలిసేందుకు ఐదు రోజుల క్రితం ఆ ద్వీపానికి వెళ్లినట్లు స్థానిక మత్స్యకారులు తెలిపారు. తాజాగా జాన్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జాన్‌ను సెంటినెల్ ద్వీపానికి తీసుకెళ్లిన ఏడుగురు జాలర్లను అరెస్టు చేసి విచారిస్తున్నారు. సెంటినెలీస్ తెగ ప్రజలు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోరు. కాగా.. గతంలోనూ జాన్ పలుసార్లు సెంటినెల్ ద్వీపానికి వెళ్లి అక్కడి ప్రజలను కలిసినట్లు స్థానిక విూడియా కథనాలు పేర్కొన్నాయి. ఆ తెగ ప్రజలకు బోధనలు చేసేందుకు జాన్ వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పోలీసులు స్పష్టతనివ్వలేదు.