అంతర్జాతీయ క్రికెట్‌కు  వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ బ్రావో వీడ్కోలు

– 2004లో అరగ్రేటం చేసిన బ్రావో
న్యూఢిల్లీ, అక్టోబర్‌25(జ‌నంసాక్షి): అంతర్జాతీయ క్రికెట్‌కు సెలవు ప్రకటించారు. ఇక నుంచి తాను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ తీసుకుంటున్నట్లు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ‘అంతర్జాతీయ క్రికెట్‌ అన్ని ఫార్మాట్ల నుంచి అధికారికంగా రిటైర్‌ అవుతున్నానని తెలిపాడు. ఈ సందర్భంగ్రా బ్రావో మాట్లాడుతూ.. 14ఏళ్ల క్రితం వెస్టిండీస్‌ తరఫున అరంగేట్రం చేసిన క్షణాలు నాకిప్పటికీ గుర్తున్నాయని అన్నారు. 2004 జులైలో లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌పై తొలి మ్యాచ్‌ ఆడటానికి మైదానంలోకి వెళ్లే ముందు మెరూన్‌ క్యాప్‌ అందుకున్నానని అన్నారు. ఆరోజు నాలో కలిగిన అనుభూతి, ఉత్సాహం.. ఇన్నేళ్ల నా కెరీర్‌లో ప్రతిక్షణం తోడుగా ఉన్నాయని బ్రావో తెలిపారు. ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా సుదీర్ఘకాలం కొనసాగానని, యువతరం క్రికెటర్లకు కూడా ఆ అవకాశం రావాలని, అందుకే అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవుతున్నా తెలిపాడు.  తనకు మద్దతుగా నిలిచిన అభిమానులు, కుటుంబం, తోటి ఆటగాళ్లకు బ్రావో కృతజ్ఞతలు తెలిపారు. అయితే ప్రపంచవ్యాప్తంగా టీ20 ఫ్రాంచైజీల్లో కొనసాగుతానని బ్రావో పేర్కొన్నారు. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన బ్రావో.. తన కెరీర్‌లో 40 టెస్టులు, 164 వన్డేలు, 66 టీ20లు ఆడారు. టెస్టుల్లో బ్రావో 2200 పరుగులు చేశారు. ఇందులో 3 శతకాలు, 13 అర్ధశతకాలు ఉన్నాయి. ఈ ఫార్మాట్‌లో 86 వికెట్లు తీశారు. ఇక 164 వన్డేల్లో బ్రావో 2968 పరుగులు చేసి, 199 వికెట్లు తన ఖాతాలో వేసుకొన్నారు. టీ20ల్లో 1142 పరుగులు చేసి 52 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. చివరిసారిగా 2014లో భారత్‌పై బ్రావో ఆఖరి వన్డే ఆడారు. ఆ సమయంలో బ్రావో విండిస్‌
కెప్టెన్‌గా వ్యవహరించారు.