అందుకే భారీ షాట్లు ఆడాను

భారత మహిళల జట్టు సారథి హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌

 

ప్రావిడెన్స్‌(గయానా): మహిళల టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హర్మన్‌ ప్రీత్‌ సేన 34పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. తక్కువ పరుగుల వ్యవధిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోవడంతో క్రీజులోకి వచ్చిన సారథి హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌((103; 51 బంతుల్లో 7్ఖ4, 8్ఖ6), వన్‌డౌన్‌ బ్యాట్స్‌వుమెన్‌ జెమిమా రోడ్రిగ్స్‌ (59; 45 బంతుల్లో 7్ఖ4)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. అయితే ఆరంభంలో ఆచితూచి ఆడుతూ వచ్చిన హర్మన్‌.. క్రమంగా దూకుడు పెంచింది. ఒక దశలో ఆమె పదే పదే క్రీజు వదిలి బయటికి వస్తూ భారీ షాట్లు ఆడింది. ఈ క్రమంలో చివరి ఓవర్‌లో శతకం పూర్తి చేసుకుంది.

 

అయితే భారీ షాట్లు ఆడటానికి కారణం చెప్తూ… ‘మ్యాచ్‌కు ముందు రోజు నొప్పితో కాస్త ఇబ్బంది పడ్డాను. మ్యాచ్‌ ఆరంభానికి ముందు కూడా నొప్పిగానే అనిపించింది. ఇక మైదానంలోకి వచ్చాక పరుగులు తీయడం ఆరంభించిన తర్వాత ఒక్కసారిగా కడుపు వద్ద కండరాలు పట్టేశాయి. ఫిజియో వచ్చి చికిత్స చేసిన అనంతరం.. ఎక్కువసేపు పరిగెత్తితే.. నొప్పి తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో దీనికి ప్రత్యామ్నాయంగా భారీ షాట్లు ఆడాలని నిర్ణయించుకున్నాను. ఇదే విషయాన్ని రోడ్రిగ్స్‌కి వివరించి.. నువ్వు నాకు స్ట్రయికింగ్‌ ఇస్తే.. నేను భారీ షాట్లు కొడతానని చెప్పాను. అదే జోరు చివరి దాకా కొనసాగించాను.’ అని హర్మన్‌ పేర్కొంది.

 

”ఈ క్రమంలో నేను ఎన్ని పరుగులు తీస్తున్నా అనే విషయం పట్టించుకోలేదు గెలవడానికి ఎన్ని పరుగులు కావాలో అనే విషయమే ఆలోచించాను. ఒకవేళ మేము 150పరుగులకే పరిమితమైతే.. మ్యాచ్‌ గెలవలేము అని నిర్ణయించుకున్నాం. కారణం వారి జట్టులో అత్యుత్తమ క్రీడాకారులు ఉన్నారు.. ముఖ్యంగా సుజీ బేట్స్‌ లాంటి స్టార్‌ బ్యాట్స్‌వుమెన్‌ ముందు ఈ లక్ష్యం చాలా చిన్నది అని నిర్ణయించుకున్నాం. అందుకే ముందు నిలదొక్కుకొని తర్వాత నుంచి భారీ స్కోరు సాధించవచ్చని అనుకున్నాను’ అని పేర్కొన్నారు.