అక్టోబర్,నవంబర్‌లో టిఆర్‌ఎస్ రాజకీయ సభ
ఇందుకోసం సిఎం కెసిఆర్ కసరత్తు
ప్లీనరీ విజయవంతం చేసేలా నేతలకు దిశానిర్దేశం :కడియం
వరంగల్,ఏప్రిల్ 24(జనంసాక్షి): గత నాలుగేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. దేశంలోనే నెంబర్ వన్ సంక్షేమ రాష్ట్రంగా, అభివృద్ధిలో ముందుకు వెళ్తున్న రాష్ట్రంగా అందరి ప్రశంసలు అందుకున్నదన్నారు.ఈ ప్లీనరీకి ప్రత్యేకత ఉందని, దీనిలో రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను, ఫెడరల్ ఫ్రంట్ గురించి కూడా చర్చించనున్నారు. మే 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పంపిణీ చేయనున్న పట్టాదార్ పాస్ పుస్తకాలు, వ్యవసాయానికి ఇన్ పుట్ సబ్సిడీ, మిషన్ భగీరథ వంటి పథకాల గురించి పార్టీ నేతలకు వివరించనున్నారని చెప్పారు. ప్లీనరీకి ఎవరు కూడా హాజరు కాకుండా ఉండొద్దని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఇదిలావుంటే ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో పార్టీ బహిరంగసభను భారీ ఎత్తున నిర్వహించాలని సిఎం కేసిఆర్ నిర్ణయించారని, ఇందుకోసం నియోజక వర్గం నుంచి వందమంది ప్రతినిధులను ఈ సమావేశానికి రావల్సిందిగా నిర్ధేశించారన్నారు. నియోజక వర్గానికి వందమందికి పాస్ లు ఇస్తారని, దీనికోసం ఈ నెల 26వ తేదీన నియోజక వర్గం నుంచి ఎంపిక చేసిన వందమంది సభ్యులు తమపేర్లను నమోదుచేసుకోవాలని చెప్పారు. ఇందుకోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారన్నారు. పేర్లు నమోదు చేసుకున్న వారికే బ్యాడ్జీలు, బ్యాగులు అందిస్తారన్నారు. ఈనమోదు చేసుకున్న పేర్లను ఎన్నికల కమిషన్ కు పంపించాలన్న ఆలోచనతో ఈసారి పకడ్బందీగా నమోదు కార్యక్రమం ఉంటుందని సిఎం కేసిఆర్ చెప్పారన్నారు. ప్రతి ఒక్కరూ హాజరై ప్లీనరీని విజయవంతం చేయాలన్నారు. వ్యక్తిగత వాహనాల్లో కాకుండా కలిసి బస్సులో రావాలన్నారు. వచ్చే ఏడాదిలో ఎన్నికలున్నందున, ఇప్పుడు జరగనున్న ప్లీనరీ సమావేశం పార్టీకి అత్యంత ముఖ్యమైందని కడియం శ్రీహరి అన్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలంతా పాత, కొత్త అనే తేడా లేకుండా కలిసిమెలిసి రావాలన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యులు ఈ బాధ్యతలు తీసుకుని ఉమ్మడి వరంగల్ జిల్లా తరపున ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ధేశించినట్లు వందమందిని తీసుకొచ్చి సభను విజయవంతం చేయాలన్నారు. అయితే నియోజక వర్గానికి వందమంది వస్తున్న నేపథ్యంలో వ్యక్తిగత వాహనాల్లో కాకుండా బస్సుల్లో రావాలని సిఎం కేసిఆర్ సూచించినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. ప్లీనరీకి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలంతా హాజరయ్యేందుకు సన్నాహాక సమావేశంలో దిశానిర్దేశం చేశామని కడియం శ్రీహరి తెలిపారు. ఈ సమావేశానికి పూర్వ ఉమ్మడి జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, కార్పోరేషన్ చైర్మన్లు, సభ్యులు, పార్టీ నేతలు హాజరయ్యారు. ప్లీనరీని ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నిర్వహించుకోవాలని, పాత-కొత్త నేతలంతా కలిసి ప్లీనరీకి హాజరు కావాలని సిఎం కేసిఆర్ చెప్పినట్లు తెలిపారు. పార్టీకి సంబంధించిన ప్లీనరీ సన్నాహక సమాశానికి ముఖ్యులు, నేతలు సరిగా రానందుకు బాధగా ఉందని, భవిష్యత్ లో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని అన్నారు. మరోవైపు ఈనెల 27న నిర్వహించే తెరాస ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభను విపక్షాలకు కనువిప్పు కలిగేలా విజయవంతం చేయాలని మంత్రి కడియం శ్రీహరి పార్టీ నేతలకు సూచించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి ఎంత మంది వస్తారు, వాహనాల పరిస్థితి ఏంటి, సభకు సంబంధించిన ప్రచారం ఎలా సాగుతోంది, సభాస్థలిలో పనులు ఎంతవరకు పూర్తయ్యాయనే కోణంలో నేతలను అడిగి తెలుసుకున్నారు. సభను అనుకున్న
స్థాయిలో నిర్వహించి తెరాస సర్కారు నాలుగేళ్లలో అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలనే గట్టి సంకల్పంతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మకాన్ని నిజంచేసి చూపాలని నేతలకు దిశానిర్దేశర చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనెల 27న నిర్వహించే భారీ బహిరంగ సభ విజయవంతానికి నేతలంతా ఉమ్మడిగా కృషి చేస్తున్నారు. మిషన్ భగీరథ, రెండు పడకల ఇళ్ల నిర్మాణాలపై కీలక ప్రకటన చేస్తారు.విద్యుత్తు ,రహదారుల విస్తరణ దేవాదుల ఎత్తిపోతలు తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తారు. దీంతో మూడు, నాలుగు రోజులుగా పనుల వేగం పుంజుకుంది.