అటవీ హక్కులతో గిరిజన రైతులకు చేయూత

రైతుబందుతో పెట్టుబడి కష్టాలు దూరం

భూపాలపల్లి,జూన్‌14(జ‌నం సాక్షి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలున్న రైతులకు సైతం వర్తింప చేయడంతో గిరిజన రైతులకు పంట పెట్టుబడి ఇబ్బందులు దూరమయ్యాయి. జిల్లాలోని రైతుబంధు పథకం రైతుల పాలిట వరంగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా పేద, గిరిజన రైతులు ఉండడం వానాకాలం పంటలను సాగు చేస్తారు. జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో గతంలో అటవీభూములు సాగు చేసుకుంటున్న రైతులకు అటవీహక్కు పత్రాలను అందజేశారు.ఈ భూముల గిరిజన రైతులకు పంటల సాగుకు అవసరమైన సాయం లభించకపోవడంతో వ్యవసాయ పెట్టుబడులకు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. గతంలో బ్యాంకులు అటవీ హక్కుపత్రాలు ఉన్న రైతులకు బ్యాంకు రుణాలు మంజూరు చేసినా భూముల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో సమస్య తలెత్తింది. అటవీ భూములను ఆన్‌లైన్‌లో పొందుపర్చకపోవడంతో పహాణీలు రాకపోగా బ్యాంకు రుణాలు లభించలేదు. ఫలితంగా రైతులు పంట పెట్టుబడుల కోసం ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు చేయాల్సి వచ్చేది. అటవీహక్కు భూములు సాగు చేస్తున్న గిరిజన రైతులు ఏటా పంట పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడేవారు. దళారులు వడ్డీ వ్యాపారుల వద్దకు పోతేకాని వారికి విత్తనాలు, ఎరువులు లభించేవి కావు. అమాయక రైతులకు వ్యాపారులు ఆసరాగా చేసుకుని నకిలీ విత్తనాలు, ఎరువులు అప్పుగా ఇచ్చేవారు. ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి పంటలు సాగు చేసినా పంట దిగుబడులపై నమ్మకం ఉండేది కాదు. జిల్లా వ్యాప్తంగా ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలున్న రైతులకు నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. రైతుబంధు పథకంలో భాగంగా ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలున్నా రైతులకు గత నెల రెండ్రోజులు పాటు చెక్కులను పంపిణీ చేశారు. రెండేళ్లుగా నకిలీ విత్తనాల కారణంగా పలువురు రైతులు పత్తి, సోయాబీన్‌, కంది పంటలను నష్టపోయారు. రైతుబంధు పథకంలో భాగంగా గత నెలలో ఎకరాకు రూ.4 వేల చొప్పు పంట పెట్టుబడిని ప్రభుత్వం పంపిణీ చేయడంతో ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలున్న రైతులు ముందుగానే విత్తనాలను కొనుగోలు చేసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లోని రైతులు ఎక్కువగా పత్తి, సోయాబీన్‌ తర్వాత కంది పంటలను పండిస్తారు. రైతుబంధు డబ్బులతో తమకు అవసరమైన విత్తనాలను కొనుగో లు చేసుకుని సిద్ధంగా ఉంచుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సీజన్‌ ప్రారంభం నుంచి వర్షాలు కురుస్తుండడంతో పంటలు వేస్తున్నారు. ఈ ఏడాది నుంచి సీజన్‌కు ముందుగానే చేతిలో డబ్బులు ఉండడంతో గిరిజన రైతులకు సకాలంలో విత్తనాలు వేసే అవకాశం లభించింది.