అట్టుడుకుతున్న అరుణాచల్‌

డిస్యూటి సిఎం ఇంటిని తగులబెట్టిన ప్రజలు
ఈటానగర్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ ప్రదేశ్‌ అట్టుడుకుతున్నది. ఆరు సామాజిక వర్గాలకు స్థానికంగా శాశ్వత నివాస ధృవపత్రాలు ఇవ్వాలన్న నిర్ణయాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగారు. కర్ఫ్యూని కూడా లెక్క చేయకుండా వీధుల్లోకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నారు. డిప్యూటీ సీఎం చౌనా మే ఇంటిని తగులబెట్టారు. వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసు డిప్యూటీ కమిషనర్‌ ఇంట్లోకి చొరబడి ధ్వంసం చేశారు. శుక్రవారం పోలీసు ఫైరింగ్‌లో గాయపడిన ఆందోళనకారుడు చనిపోవడంతో వాళ్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నహర్‌లాగూర్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లే రోడ్డును ఆందోళనకారులు పూర్తిగా నిర్బంధించారు. రాళ్ల దాడి తీవ్రమై 35 మంది గాయపడటంతో శనివారం నుంచి రాజధాని ఈటానగర్‌తోపాటు నహర్‌లాగూన్‌లో నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్‌ సర్వీసులను పూర్తిగా నిలిపేశారు. ఈటానగర్‌లోని అన్ని మార్కెట్లు, పెట్రోల్‌ బంకులు, దుకాణాలు మూతపడ్డాయి. మూడు రోజుల్లో మొత్తం 60 వాహనాలు మంటలకు ఆహుతి కాగా.. మరో 150 వాహనాలు ధ్వంస మయ్యాయి. అరుణాచల్‌లోని నామ్‌సాయ్‌, చాంగ్‌లాంగ్‌ జిల్లాల్లో దశాబ్దాలుగా ఉంటున్న ఆరు సామాజిక వర్గాలకు శాశ్వత నివాస ధృవీకరణ పత్రాలు అందించాలన్న జాయింట్‌ హై పవర్‌ కమిటీ సిఫారసులను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.