అడపాదడపా వర్షాలతో చల్లబడ్డ వాతావరణం

ఎండల నుంచి తేరుకున్న ప్రజలు

వరంగల్‌,జూన్‌6(జ‌నం సాక్షి): వరంగల్‌ ఉమ్మడిజిల్లాలో వర్షాల రాక మొదలయ్యింది. మండిన ఎండలు మాయమై చల్లని వాతావారణం ముసురుకుంది. గత మూడు నెలలుగా మండుటెండలతో అల్లాడిన ప్రజలు చిరుజల్లులతో సేదదీరారు. అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రుతుపవనాల రాకకు ముందే క్యూములోనింబర్‌ మేఘాల కారణంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. రోహిణీ కార్తె నేపథ్యంలో వారం నుంచి ఎండలు మండిపోయాయి. దంచికొట్టిన ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు ఈ వర్షానికి ఉపశమనం పొందారు. వర్షంతో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. వరినార్లు పోసుకునేందుకు, దుక్కులు దున్నిం చేందుకు, పత్తి, మిరప, మొక్కజొన్న మొదలు తొలగించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రోహిణీ కార్తె మధ్యలో వర్షం పడితే ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని పలువురు రైతులు అభిప్రాయపడ్డారు. పొలాల్లో ఉన్న పత్తి, మిర్చి మోడులను రైతులు తొలగించే పనులు ప్రారంభించారు. వర్షం కురవడంతో అన్నదాతలు విత్తనాలు సేకరించే పనిలో ఉన్నారు. వర్ధన్నపేట ,ఇల్లంద మార్కెట్‌ యార్డులో వరిధాన్యం తడిసింది. ఇల్లంద చెరువు కింద కోతలు జాప్యం కావడంతో గ్రామానికి చెందిన రైతులు ధాన్యాన్ని మార్కెట్‌లో పోయడంతో తడిసిపోయాయి. మార్కెట్‌ యార్డులో నిల్వ ఉంచిన మక్కల బస్తాలు తడిశాయి. ఖానాపురం మండల వ్యాప్తంగా చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. అన్నదాతలు విత్తనాలు, ఎరువులు తెచ్చుకునేందుకు ఫర్టిలైజర్‌ షాపులకు తరలివెళ్లారు. సంగెం మండలంలో ఉరుములు, మెరుపులతో వాన పడింది. మొత్తంగా జిల్లా అంతటా వర్షాల సీజన్‌ కనిపించింది.