అడవుల పెంపు లక్ష్యంగా సీడ్‌బాల్స్‌ వినియోగం

ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్న డిఆర్‌వో పివో

జనగామ,జూలై7(జ‌నం సాక్షి): జనగామ జిల్లాలో ప్రస్తుతం ఒక శాతం ఉన్న ఆటవీ సంపదను రానున్న రోజుల్లో 25శాతానికి పెంచేందుకు గత జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన ప్రారంభించిన సీడ్‌బాల్స్‌ తయారీ ముమ్మరంగా సాగుతోంది. డీఆర్‌డీవో జయచంద్రారెడ్డి పర్యవేక్షణలో దీనిని చురకుగా చేపట్టారు. దీనిని మళ్లీ కొనసాగించే ఆలోచనలో ప్రస్తుత అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. డీఆర్‌డీవో, ఏపీడీ, ఏపీఎంలు స్వయంగా మహిళలతో కలిసి సీడ్‌బాల్స్‌ను తయారు చేశారు. జిల్లాలో అడవులను పెంచేందుకు మిషన్‌ సీడ్‌ బాల్స్‌ అనే వినూత్న పక్రియ ద్వారా కోటి విత్తన బంతుల తయారు చేసి చల్లారు. జిల్లా గ్రావిూణాభివృద్ధి సంస్థ, అటవీశాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరిగే బంతుల తయారీలో రోజుకు ఒక మండల మహిళా సమాఖ్య సభ్యులంతా భాగస్వాములు అయ్యారని చెప్పారు. ఎర్రమట్టి, జీవామృతం, కంపోస్టు సమ్మేళనంలో విత్తనాన్ని చేర్చే పక్రియ వేసవిలో చేసుకొని విత్తనాల బంతులు జిల్లా వ్యాపితంగా కొండలు, గుట్టల్లోని ఖాళీ స్థలాల్లో వేస్తామన్నారు. వర్షాలు కురిసిన తర్వాత విత్తనాలు మొలకెత్తుతాయన్నారు. అటవీ శాతాన్ని 25శాతానికి పెంచడం ప్రధాన లక్ష్యమైన పవిత్రకార్యంలో అందరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో హరితహారం కింద కోటి మొక్కల పెంపకానికి కోటి విత్తనాల బంతులు తయారు చేయాల్సి ఉందన్నారు. ఈ మేరకు కొండలు, గుట్టల వద్ద కందకాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.గత రెండేళ్లుగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో జరిగిన తప్పిదాలు, లోటుపాట్లు ఈసారిపునరావృత్తం కాకుండా సరిదిద్దుతామని తెలిపారు. మొక్కల పెంపకం, దాని ఆవశ్యకతపై సంబంధిత శాఖ అధికారులు విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఇదిలావుంటే జిల్లాలో అటవీ సంపదను పెంపొందించేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయడంతోపాటు హరితహారంలో మొక్కలు నాటాలని డీఆర్డీవో మేకల జయచంద్రారెడ్డి కోరారు. నాలుగో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, గ్రామాల్లో, మండల కేంద్రాల్లో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని కోరారు. వందకు వంద శాతం నాటిన మొక్కలను సంరక్షించుకునేలా పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని కోరారు. ప్రతీ గ్రామంలో అధికారులు ముందుగానే హరితమొక్కలు నాటేందుకు మొక్కలు నాటే ప్రాంతాల్లో రంద్రాలను తీయించి మొక్కలు నాటేందుకు సిద్దంగా ఉండేలా చూడాలని సూచించారు. ప్రభుత్వం అందించే మొక్కల్లో ప్రతీ ఇంటికి ఐదు నుంచి ఆరుమొక్కలను అందించి వాటిని సంరక్షించేలా చూడాలని జయచంద్రారెడ్డి సూచించారు. జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచేలా అందరూ కృషి చేస్తూ అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. హరితహారం కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆయన సూచించారు.

—————-