అత్యవసర విచారణ అవసరం లేదు

– తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రిం
న్యూఢిల్లీ, అక్టోబర్‌9(జ‌నంసాక్షి) : శబరిమల ఆలయంలో మహిళలను అనుమతిస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో రెండు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ఈ పిటిషన్లపై అత్యవసరంగా విచారణ చేయలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. గతనెల 28న ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతినిస్తూ తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును పున:సవిూక్షించాలంటూ రెండు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. జాతీయ అయ్యప్ప భక్తుల సంఘం, నాయర్‌ సర్వీస్‌ సొసైటీలు ఈ పిటిషన్లను వేశారు. సుప్రీం తీర్పు ప్రజల ఆకాంక్షలకు, అభిప్రాయాలకు అనుగుణంగా లేదని కేరళకు చెందిన నాయర్‌ సర్వీస్‌ సొసైటీ పేర్కొంది. మహిళలందరికీ ప్రవేశం కల్పించేలా ఆదేశించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించినవారు అయ్యప్ప భక్తులు కాదని మరో పిటిషనర్‌ జాతీయ అయ్యప్ప భక్తుల సంఘం అధ్యక్షురాలు శైలజ విజయన్‌ కోర్టుకు తెలిపారు. సుప్రీం తీర్పు లక్షల మంది అయ్యప్ప భక్తుల ప్రాథమిక హక్కులపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఈనెల 17నుంచి శబరిమలలో ఆలయాన్ని తెరువనున్న నేపథ్యంలో తీర్పుపై తక్షణమే స్టే విధించాలని, ఈ రెండు పిటిషన్లపై వెంటనే విచారణ జరపాలని పిటిషనర్లు కోరారు. కాగా ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారణకు స్వీకరించాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.