అధ్యక్ష ఎన్నికల ఫలితాలే కీలకం

అగ్రరాజ్య అధ్యక్ష పీఠం కోసం పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల ప్రతినిధి హిల్లరీ క్లింటన్‌లలో విజయం ఎవరిని వరించనుందా అని ప్రపంచ మార్కెట్లతోపాటు దలాల్‌స్ట్రీట్ వర్గాలూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈవారంలో విడుదలకానున్న కార్పొరేట్ కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాలు కూడా మార్కెట్లో ట్రేడింగ్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నాయి. 

న్యూఢిల్లీ, నవంబర్ 6: ఈనెల 8న జరుగనున్న అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల ఫలితాలపైనే స్టాక్ మార్కెట్ వర్గాలు ప్రధానంగా దృష్టిసారించనున్నాయి. డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్‌లలో ఎవరు యూఎస్ ప్రెసిడెంట్ కానున్నారని ప్రపంచ ఇన్వెస్టర్లందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. క్లింటన్ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ ఇద్దరిలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో ఫలితాలు వెలువడితేగానీ ఎవరు గెలిచారో అని చెప్పలేకుండా ఉంది. యూఎస్ ఎలక్షన్స్‌తోపాటు కార్పొరేట్ సంస్థల రెండో త్రైమాసిక ఫలితాలు కూడా మార్కెట్ల గమనాన్ని నిర్దేశించడంలో తమ వంతు పాత్ర పోషించనున్నాయి. ఈవారం ఫలితాలు వెల్లడించనున్న ప్రముఖ కంపెనీల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (భెల్), లుపిన్, బీపీసీఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా ఉన్నాయి. శుక్రవారం విడుదలకానున్న సెప్టెంబర్ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలపైన సైతం ట్రేడర్లు దృష్టి సారించనున్నారు.
మొత్తంగా చూస్తే ఈవారంలో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ నిస్సత్తువగా కొనసాగనుంది. దేశీయ అంశాల కంటే గ్లోబల్ సంకేతాలే ట్రేడింగ్ సెంటిమెంట్‌కు ప్రధానం కానున్నాయి. ప్రపంచ మార్కెట్ల స్పందనకు అనుగుణంగానే దలాల్‌స్ట్రీట్‌లోనూ ట్రేడింగ్ సెంటిమెంట్ మారనుందని ఈక్విటీ విశ్లేషకులంటున్నారు. 
గతవారంలో ప్రామాణిక సూచీలు భారీ నష్టాలెదుర్కోవాల్సి వచ్చింది. సెన్సెక్స్ 667.36 పాయింట్లు (2.38 శాతం), నిఫ్టీ 204.25 పాయింట్లు (0.36 శాతం) కోల్పోయాయి. సెన్సెక్స్‌లోని టాప్ 7 కంపెనీలు రూ.72,452 కోట్ల సంపదను కోల్పోయాయి. యూఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితి తొలిగాకే మార్కెట్ సూచీలు తమ గమనాన్ని నిర్దేశించుకోనున్నాయని, అప్పటివరకు మదుపర్లు వేచి చూసే ధోరణిని ప్రదర్శించవచ్చని శామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమీత్ మోదీ పేర్కొన్నారు. 
hill

ఈ వారంలో రెండు కంపెనీల లిస్టింగ్ 


మరో రెండు కంపెనీలు ఈవారం స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కానున్నాయి. ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రమోట్ చేస్తున్న పీఎన్‌బీ హౌజింగ్ ఫైనాన్స్ షేర్లు సోమవారం లిస్ట్ కానుండగా.. అంతర్జాతీయ శీతల పానీయాల సంస్థ పెప్సీకోకు చెందిన అతిపెద్ద ఫ్రాంచైజీ వరుణ్ బెవరేజెస్ స్టాకులు మంగళవారం లిస్ట్ కానున్నాయి. గతనెల 25-27 తేదీల మధ్యలో తొలి పబ్లిక్ ఆఫరింగ్‌కు (ఐపీవో) వచ్చిన పీఎన్‌బీ హౌజింగ్ ఫైనాన్స్ ప్రైమరీ మార్కెట్ నుంచి రూ.3000 కోట్లు సేకరించింది. అక్టోబర్ 28తో ముగిసిన ఐపీవోలో వరుణ్ బెవరేజెస్ రూ.1,112 కోట్లు సమీకరించగలిగింది.