అనిల్‌ అంబానీకి..  సుప్రింలో చుక్కెదురు


– 4వారాల్లో డబ్బులు చెల్లించకుంటే జైలు తప్పదు
– ఎరిక్‌సన్‌ కేసులో సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి20(జ‌నంసాక్షి) : ముకేశ్‌ అంబానీ సోదరుడు, ఆర్‌కామ్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈయనకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. స్వీడన్‌కు చెందిన టెలికం ఉపకరణాల సంస్థ ఎరిక్‌సన్‌ వివాదంలో భారీ షాక్‌ తగిలింది. ఎరిక్‌సన్‌కు 4 వారాల్లోపు రూ.453 కోట్లు చెల్లించాలని అనిల్‌ అంబానీని సుప్రీం కోర్టు ఆదేశించింది. లేకపోతే మూడు నెలలు జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారీమన్‌, జస్టిస్‌ వినీత్‌ సహరన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది.  దీంతోపాటు అనిల్‌ అంబానీ, రిలయన్స్‌ టెలికాం ఛైర్మన్‌ సతీష్‌ సేత్‌, రిలయన్స్‌ ఇన్ఫాట్రెల్‌ ఛైర్‌పర్సన్‌ ఛాయా విరానీలు తలా రూ.కోటి రూపాయలు అపరాధ రుసుం చెల్లించాలని పేర్కొంది. నెలలోపు ఈ మొత్తాన్ని డిపాజిట్‌ చేయకపోతే నెల రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది. ఎరిక్సన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. వారి వద్ద రఫేల్‌ కోసం డబ్బులు ఉంటాయని, ప్రతిష్ఠాత్మకమైన ప్రతి ప్రాజెక్టులో భాగస్వామి కావడానికి వారి వద్ద డబ్బు ఉంటుందని, మాకు చెల్లించడానికి మాత్రం ఉండదని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. న్యాయస్థానం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని దవే వాదనలు వినిపించారు. అనిల్‌ అంబానీ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. దీంతో కేవలం క్షమాపణలు చెబితే సరిపోదని ఆర్‌కామ్‌కు సుప్రీం మొట్టికాయలేసింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనకు తగిన మూల్యం చెల్లించాలని వ్యాఖ్యానించింది. మరోవైపు అనిల్‌ అంబానీని అరెస్ట్‌ చేయాలన్న ఎరిక్‌సన్‌ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.