అను‘మతి’ లేని వైద్యం

 ఆర్ఎంపి నిర్వాకం
డోర్నకల్ సెప్టెంబర్ 10 జనం సాక్షి
వారు కేవలం ఫస్ట్‌ ఎయిడ్‌… అంటే ప్రాథమిక చికిత్స మాత్రమే చేయడానికి అర్హులు. కాని వారు ఎంఎస్‌  సర్జన్ల మాదిరిగా ఆపరేషన్లు కూడా చేసి పారేస్తుంటారు. కమీషన్ల కోసం ఇబ్బడిముబ్బడిగా నోటికొచ్చిన మందులు, యాంటీబయాటిక్స్‌ రాసి పారేస్తుంటారు. అవి వాడిన రోగులకు కొత్తరోగాలు రావడం,కిడ్నీలు ఫెయిలవడమే కాకుండా ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతుంటాయి. వీరిపై ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ లేకపోవడంతో గ్రామీణుల ప్రాణాలతో కొందరు ఆర్ఎంపీలు చెలగాటమాడుతున్నారు.కొందరికి పట్టుమని పదో తరగతి కూడా చదవరు… అయినా పల్లెటూరులో పెద్ద డాక్టర్‌గా చెలామణి అవుతుంటారు…చిన్న గదిలోనే పెద్ద ఆస్పత్రి మాదిరిగా సెలైన్‌లు పెట్టడం, మందులు పెట్టి అమ్మటం, గాయాలకు కుట్లు వేయటం చేస్తూ అను‘మతి’ లేని వైద్యంతో గ్రామీణుల ప్రాణాలతో చెలగాటమాడుకుంటున్నారు.మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల పరిధి వెన్నారం గ్రామంలో ఆర్ఎంపి డాక్టర్ ప్రసాద్ చేసిన వైద్యం ఓ వ్యక్తి ప్రాణాల మీదికి తెచ్చింది.బాధితుడు తెరాస గ్రామ పార్టీ అధ్యక్షుడు కాసర్ల శ్రీను తెలిపిన వివరాలిలా.. గత నెల 15న అనారోగ్యంతో స్థానిక ఆర్ఎంపీ వైద్యుడు ప్రసాద్ ను సంప్రదించగా ఇంజక్షన్ చేసినట్లు తెలిపారు.వెంటనే కాళ్ల వాపులు రావడంతో ఆర్ఎంపి డాక్టర్ ఖమ్మం హాస్పిటల్ కు తీసుకువెళ్లి పరీక్షలు జరిపి కిడ్నీ ఇన్ఫెక్షన్,గుండె పనితీరు,బిపి తక్కువగా ఉందని వైద్యం చేసినట్లు తెలిపారు.ఆరోగ్యం క్షీణించడంతో బంధువులు హైదరాబాద్ హాస్పిటల్కు తరలించే ప్రయత్నాన్ని అక్కడి వైద్యులు అడ్డుకొని మరో డాక్టర్ తో చికిత్స చేయించినట్లు తెలిపాడు.అయినా తగ్గకపోవడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించి ఐసియులో చికిత్స చేయించినట్లు తెలిపారు.ఆర్ఎంపీ డాక్టర్ జాగర్లమూడి ప్రసాద్ చేసిన వైద్యంతోనే తనకు ఈ దుస్థితి ఏర్పడిందని అంటున్నాడు.వచ్చిరాని వైద్యంతో తన ప్రాణాలతో చెలగాటమాడిన ప్రసాద్ పై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నాడు.