అనుమానాస్పద స్థితిలో వృద్ద దంపతుల మృతి
న్యూఢిల్లీ,జనవరి28(జనంసాక్షి): వృద్ధ దంపతులు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన దక్షిణ ఢిల్లీలోని అమర్ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వీరేందర్ కుమార్ ఖనేజా (77), సరళ(72) అనే దంపతులు కనిపించడంలేదని ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దంపతుల ఇంటికి వచ్చేసరికి డోర్ లోపల నుంచి లాక్ చేసి ఉంది. దీంతో పోలీసులు డోర్‌ను పగలగొట్టి లోపలికి వెళ్లిచూడడంతో వృద్ధ దంపతుల మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయని స్థానిక డిఎస్‌పి చిన్మయి బిస్వాల్ తెలిపారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వృద్ధ దంపతుల కుమారుడు అమిత్ ఖనేజా అమెరికాలో ఉంటున్నాడు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ కేసు నిమిత్తం ఇంట్లో పని వాళ్లను విచారించగా ఇంట్లో నుంచి పది లక్షల రూపాయల విలువగల బంగారాన్ని దొంగతనం చేసినట్టు విచారణలో తేలింది. దీంతో పనిమనిషి, ఆమె కుమారుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రతి రోజు ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు.



