అనేక పాఠశాలల్లో అరకొర వసతులు

మద్యాహ్నభోజనానికి అవరోధాలు
ఆదిలాబాద్‌,ఫిబవ్రవరి4 (జనంసాక్షి):  అనేక పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు దారుణంగా ఉన్నాయి. కరోనాతో మూతపడ్డ పాఠశాలల్లో వసతులు దారుణంగా ఉన్నాయి. స్కూల్లు తెరుచుకుంటున్నా విద్యార్థుల రాక అంతంత మాత్రంగానే ఉంటోంది. ముఖ్యంగా సంబంధిత పాఠశాలల్లో ప్రత్యేకంగా వంట గదులు నిర్మించక పోవడంతో నిర్వాహకులు చెట్ల కిందే వంటలు చేస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. మరోవైపు విద్యార్థులు భోజనం చేయడానికి ప్రత్యేకంగా గదులు నిర్మించక పోవడంతో ఆరుబయట, చెట్ల కింద, తరగతి గదుల వరండాలే భోజన శాలలుగా మారాయి. మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం కానవస్తోంది. విద్యార్థులకు అందించే మెనూలో నిర్వాహకులు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యాశాఖాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో మధ్యాహ్న భోజనం పథకాన్ని నిర్వహించే ఏజెన్సీలు, వర్కర్లు మొక్కుబడిగా వంటలు చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు
వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వంటకు ఉపయోగించే బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయలు, కారం, చింతపండు, పసుపు తదితర సరకుల నాణ్యత సరిగ్గా లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా పాఠశాలల్లో ఆరు బయటనే వంటలు వండుతున్నారు. ముఖ్యంగా మారుమూల పాఠశాలల్లో పర్యవేక్షణ లోపంతో మధ్యాహ్న భోజ నంలో మెనూ పాటించడం లేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. మధ్యాహ్న భోజనంలో ఎక్కువ శాతం కిచిడి అన్నం వడ్డిస్తున్నారు. వారం రోజులలో కూరగాయలు, గుడ్లు వంటి పౌష్టిక ఆహారం పంపిణీలో జాప్యం జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాఠశాలల్లో మంచినీటి సౌకర్యం కూడా సక్రమంగా లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి నీరు తీసుకువచ్చి వంట చేస్తున్నారు. పలు పాఠశాలల్లో విద్యార్థులు భోజనం చేసిన అనంతరం చేతులు కడుక్కోవడానికి నీటి సరఫరా కూడా లేక పోవడంతో గ్రామంలో ఉన్న బోరు బావుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇకపోతే మధ్యాహ్న భోజనానికి నాసిరకం సరుకులు వాడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడిరదని విమర్శలు గుప్పిస్తున్నారు.