అన్నదాతను దగా చేస్తున్న దళారులు

mjb4blvqహైదరాబాద్ : వరంగల్ జిల్లాలో కరవు కారణంగా ఖరీఫ్‌లో వేసిన మొక్కజొన్న, వరి పంటలు పూర్తిగా ఎండిపోయాయి. తొలకరి వర్షాలకు సాగు చేసిన పత్తి కొన్నిచోట్ల చేతికొచ్చింది. పండిన కొద్దిపాటి పత్తినైనా అమ్ముకొందామని ఆశపడ్డ అన్నదాతకు దళారులు దగా చేస్తున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకు కొంటూ,.తూకాల్లో మోసాలకు పాల్పడుతూ రైతును నిలువునా ముంచుతున్నారు. వీరికి కొంతమంది అక్రమార్కుల అండదండలు ఉండటంతో అడిగే నాధుడే లేకుండా పోయారు. దీనికి తోడు ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా పత్తి కొనుగోలు కేంద్రాలను విచ్చలవిడిగా తెరుస్తున్నా..ఎవరూ పట్టించుకున్న పరిస్థితి లేదు.వరంగల్ జిల్లాలో 15 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలున్నాయి. ఇక్కడ సీసీఐ కొనుగోలు కేంద్రాలున్నా ఇక్క ఏనుమామూలు మార్కెట్లో తప్ప మరెకర్కడా పత్తి కొనుగోళ్లు జరగలేదు. దీంతో రైతులు దళారులను ఆశ్రయించక తప్పడం లేదు. దళారులు ఇష్టారాజ్యంగా నేరుగా రైతుల వద్ద నుంచే పత్తిని కొనుగోళ్లు చేస్తూ అక్రకమాలకు పాల్పడుతున్నారు. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన రైతు దళారుల చేతిలో నిలువు దోపిడికి గురువుతున్నాడు. ఇటు రైతులను దోపిడీ చేస్తూ, అటు మార్కెట్‌కూ, ప్రభుత్వ ఆదాయానికీ గండి కొడుతూ దళారులు లక్షల్లో సంపాదిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు 4,100 ఉండగా వ్యాపారులు, దళారులు 2600 నుంచి 3400 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల మద్దతు ధరపై రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినా..మద్దతు ధర అనేది కంటి తుడుపు ప్రకటనగా మారింది.ఓ వైపు వర్షాలు పడక..మరోవైపు పండిన పంటకు మద్దతు ధర రాక రైతులు అప్పులపాలవుతున్నారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న ఆత్మహత్యలపై, ప్రభుత్వ బాధ్యతారాహిత్యంపై టీటీడీపీ తీవ్రంగా స్పందించింది. చేతగాన్ని ప్రభుత్వం వల్లే రైతులు నిండు ప్రాణాలను బలిపెడుతున్నారని విరుచుకు పడ్డారు. 17నెలల కాలంలో రైతుల కోసం ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు సీఎం కేసీఆర్ చెప్పాలని టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. రైతుల కష్టాలు తీర్చేందుకు బాధ్యతగా..తామంతా కేంద్రమంత్రులను కలుస్తామని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ ప్రకటించారు. దేశానికి వెన్నముక రైతన్న అంటున్న ప్రభుత్వం..రైతులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు. రైతన్నల ఆత్మహత్యలను నివారణకు ప్రభుత్వం చిత్తశుద్దితో చర్యలు తీసుకొని వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలని సూచిస్తున్నారు.