అన్నివర్గాల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం మేలు: ఎమ్మెల్యే

జనగామ,జూన్‌26(జ‌నం సాక్షి): భావితరాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని కులాలకు సంబంధించిన గురుకులాలు ఏర్పాటుచేసి ఆంగ్లమాధ్యమంలో నాణ్యమైన విద్య అందించటానికి కెసిఆర్‌ సర్కార్‌ శ్రీకారం చుట్టిందని స్టేషన్‌ ఘనాపూర్‌ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. మైనార్టీ గురుకుల విద్యాలయాల ఏర్పాటుతో ఆ వర్గాలకు ప్రభుత్వ విద్యను చేరువ చేశామని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రావిూణ ప్రాంతాల్లో నివసించే కులవృత్తులు కుటుంబాలు సంపన్నులుగా ఎదగాలనే లక్ష్యంతో కోట్లు ఖర్చు చేసి గొర్రెలు, రుణాలు అందిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. రైతులకు వచ్చే సంవత్సరం పంటలకు పెట్టుబడి అందించేందుకు ఇప్పటికే ప్రభుత్వం రూ. 6 వేల కోట్లు కేటాయిందని చెప్పారు. దళారుల ప్రమేయం లేకుండా పెట్టుబడిని ఆన్‌లైన్‌లో రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 40 లక్షల మందికి ఆసరా, జీవనభృతి, గీతా కార్మికులకు ఫింఛన్లు అందిస్తుందని అన్నారు. రైతు ఆత్మహత్యల నివారణతో పాటు, కర్షకుల కుటుంబాల్లో వెలుగులు నింపి భరోసా కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి, ఖరీఫ్‌లో కలిపి రైతుకు ఎకరానికి రూ.8 వేలు అందించనుందని అన్నారు. ఇప్పటికే ఎకరాకు నాలుగువేలు అందించి చిత్తశుద్దిని చాటుకున్నామని అన్నారు.