అమర్‌నాథ్‌ యాత్రికులపై.. 

భారీ ఉగ్రదాడికి కుట్ర
– లష్కరే ఉగ్రవాదులు పథకం రచిస్తున్నట్లు సమాచారం
– భద్రతను కట్టుదిట్టం చేసిన కాశ్మీర్‌ పోలీసులు
ఢిల్లీ, జులై17(జ‌నం సాక్షి) : అమర్‌నాథ్‌ యాత్రికులను లక్ష్యంగా చేసుకుని జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడికి పాల్పడేందుకు లష్కరే తోయిబా ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం రావడంతో కశ్మీర్‌ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కశ్మీర్‌ వ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించారు. రైజింగ్‌ కశ్మీర్‌ ప్రతిక సంపాదకుడు సుజాత్‌ బుఖారీ ఇటీవల దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యలో నిందితులుగా అనుమానిస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు .. తాజాగా అమర్‌నాథ్‌ యాత్రికులపై దాడికి కుట్ర పన్నుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు హెచ్చరించాయి. ఇందుకోసం లష్కరే తోయిబా భారీగా ఉగ్రవాదులను నియమించుకుంటోందని, వారి ద్వారా భద్రతా సిబ్బంది నుంచి ఆయుధాలను దొంగలిస్తోందని సదరు వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది కంటే ఈసారి భారీ దాడులు చేయాలని లష్కరే ఎ/-లాన్‌ చేస్తున్నట్లు తెలిపాయి. ‘బుఖారీ హత్య కేసులో ప్రధాన నిందితులైన నవీద్‌ జట్‌, ఆజాద్‌ అహ్మద్‌ మాలిక్‌ ఇంకా కలిసే ఉన్నట్లు మాకు సమాచారం అందింది. వీరిద్దరూ కలిసి
గతేడాది అమర్‌నాథ్‌ యాత్రికులపై జరిగిన దాడిలాగే ఈసారి కూడా ఉగ్రదాడి చేయాలని ప్రయత్నిస్తున్నట్లు హెచ్చరికలు వచ్చాయి’ అని ఉన్నతస్థాయి అధికారి ఒకరు విూడియాకు వెల్లడించారు. అంతేగాక.. కశ్మీర్‌కు చెందిన కొందరు యువకులు పాకిస్థాన్‌ వెళ్లి అక్కడ 2 నుంచి 4 వారాల పాటు ఉగ్రవాదుల శిబిరంలో శిక్షణ తీసుకుంటున్నట్లు సదరు వర్గాలు పేర్కొంటున్నాయి. తిరిగొచ్చి కశ్మీర్‌లోని ఉగ్రవాద బృందాల్లో చేరుతున్నట్లు తెలిపాయి. గతేడాది జులై 10న అమర్‌నాథ్‌ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై లష్కరే ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 8 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఈ దాడికి ప్రధాన సూత్రధారి అయిన అబు ఇస్మాయిల్‌ గతేడాది సెప్టెంబరులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.