అమర రాజా బ్యాటరీస్‌ లాభం రూ.136 కోట్లు

amara-raja-groupహైదరాబాద్‌: సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో అమర రాజా బ్యాటరీస్‌ ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జూలై-సెప్టెంబరు కాలానికి స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన 136 కోట్ల రూపాయల నికర లాభాన్ని కంపెనీ నమోదు చేసుకుంది. గత ఏడాది (123.43 కోట్ల రూపాయలు)తో పోల్చితే నికర లాభం 10.44 శాతం వృద్ధి చెందింది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం రాబడులు 17.94 శాతం వృద్ధితో 1,289.14 కోట్ల రూపాయల నుంచి 1,520.44 కోట్ల రూపాయలకు పెరిగాయి. ఈ కాలంలో ఆటోమోటివ్‌ బ్యాటరీ వ్యాపారం రెండంకెల వృద్ధిని నమోదు చేసుకోవటం కలిసి వచ్చిందని అమర రాజా పేర్కొంది. ఒఈం విభాగం కూడా మెరుగైన పనితీరును కనబరిచిందని తెలిపింది. కీలమైన మార్కెట్లకు ఎగుమతులు పెరగటంతో ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకున్నట్లు తెలిపింది.
మరోవైపు మార్కెట్లో పోటీ వాతావరణం, సవాళ్లు ఉన్నప్పటికీ ఇండసి్ట్రయల్‌ బ్యాటరీ వ్యాపారం కూడా రెండంకెల వృద్ధిని సాధించిందని కంపెనీ వెల్లడించింది. దేశీయ, అంతర్జాతీయ మార్కె ట్లు వృద్ధిపథంలో సాగుతుండటంతో కంపెనీ కార్యకలాపాలు కూడా అదే స్థాయిలో పెరిగాయని అమర రాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జయదేవ్‌ గల్లా అన్నారు. వివిధ రంగాల్లో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యం ఉండటం కలిసి వచ్చిందని ఆయన తెలిపారు. ఫోర్‌, టూవీలర్‌ బ్యాటరీ ప్లాంట్‌ విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయని జయదేవ్‌ పేర్కొన్నారు. త్రైమాసిక కాలంలో నిర్వహణాపరంగా పనితీరును మరింత మెరుగుపరుచుకున్నట్లు కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ ఎస్‌వి రాఘవేంద్ర తెలిపారు.