అమెరికాలో దారుణం
మైనార్ బాలుడి కాల్పుల్లో తెలంగాణ వాసి మృతి
న్యూజెర్సీ,నవంబర్17(జనంసాక్షి): అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ వాసి దారుణ హత్యకు గురయ్యాడు. వెంట్నార్ సిటీలో నివసిస్తున్న మెదక్‌కు చెందిన సునీల్ ఎడ్లాను ఆయన ఇంటి ఎదుటే 16ఏళ్ల బాలుడు తుపాకీతో కాల్చి చంపేశాడు. తన ఉద్యోగాన్ని ముగించుకొని ఇంటి వచ్చిన సునీల్‌పై ఓ బాలుడు కాల్పులు జరిపాడు. సదరు బాలుడు కాపుగాసి ఆయన రాగానే కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్పులు జరిపిన అనంతరం సునీల్ కారును తీసుకొని నిందితుడైన బాలుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆయన తన తల్లి 95వ జన్మదిన వేడుకల కోసం భారత్ వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఇలా జరగడం దారుణమని సునీల్ బంధువులు వాపోతున్నారు. సునీల్ తలపై కాల్చడం వల్ల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన అనంతరం ఆయన వాహనాన్ని వేసుకొని వెళ్లిన బాలుడిని పోలీసులు పట్టుకున్నారు. ఆయన వాహనంలో ఉన్న ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా జాడ తెలుసుకుని అతడిని అరెస్టు చేశారు. సునీల్ మృతదేహానికి శనివారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. అయితే.. ఎందుకు హత్య చేశారనే విషయం మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం పోలీసులు కాల్పులు జరిపిన బాలుడిని విచారిస్తున్నారు. మైనర్ కావడం వల్ల అతడి పేరును బయటపెట్టడం లేదని పోలీసులు తెలిపారు.