అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో మోడీ భేటీ
ఉభయ దేశాల రక్షణ సహకారాలపై చర్చ
సింగపూర్,నవంబర్14(జనంసాక్షి): సింగపూర్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో భేటీ అయ్యారు. ఇరుదేశాలకు సంబంధించి పలు విషయాలపై చర్చించారు. బుధవారం ఉదయం వీరిద్దరు సింగపూర్‌లో సమావేశమయ్యారు. అక్కడ తూర్పు ఆసియా సదస్సు సందర్భంగా పెన్స్‌ను కలిశారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక రక్షణ సహకారం, ఇండో-పసిఫిక్ సంబంధాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. తీరిక లేని పనుల కారణంగా రాలేకపోతున్నానని ట్రంప్ వెల్లడించిన కొద్దిరోజులకే మోదీ, అమెరికా ఉపాధ్యక్షుడితో సమావేశం కావడంపై ఆసక్తి నెలకొంది. అమెరికా అధ్యక్ష నివాసమైన వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు నిర్వహించడంపై మోదీ పెన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. వైట్‌హౌస్‌లో మంగళవారం జరిగిన దీపావళి వేడుకల్లో డొనాల్డ్ ట్రంప్, పలువురు ప్రముఖ ఇండో అమెరికన్లు పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ మోదీ తనకు మంచి స్నేహితుడని, భారత్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ వెళ్లిన మోదీ ఫిన్‌టెక్ ఫెస్టివల్లో పాల్గొని మాట్లాడారు. పర్యటనలో భాగంగా తూర్పు ఆసియా సదస్సుతో పాటు ఏషియన్-ఇండియా అనధికారిక సమావేశంలోనూ పాల్గొననున్నారు.