అమెరికా, న్యూయార్క్‌లా హైదరాబాద్..
` ఈ మాట స్వయంగా సూపర్‌స్టార్ రజనీకాంతే అంటున్నాడు
` గంగవ్వకు అర్థమైనట్లు కూడా కాంగ్రెస్, బీజేపోళ్లకు అర్థమైతలే
` విశ్వనగరంగా ఎదిగే క్రమంలో ఒక్కో మెట్టూ అధిరోహిస్తూ వచ్చాం
` హుస్సేన్ సాగర్ ప్రాంతం ఎంతో అద్భుతం..: మంత్రి కేటీఆర్
హైదరాబాద్(జనంసాక్షి): హైదరాబాద్ నగరం అమెరికా, న్యూయార్క్‌లా తయారైందని రజనీకాంత్, సన్నీడియోల్, లయ అంటుంటే.. కాంగ్రెస్, బీజేపోళ్లకు మాత్రం అర్థమైతలేదని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. చివరకు గంగవ్వ కూడా దుబాయ్ కంటే హైదరాబాదే బాగుందని అన్నారని కేటీఆర్ తెలిపారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన గోవర్ధన్, హిమాయత్‌నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మీకి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, దాసోజు శ్రవణ్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తొమ్మిదిన్నరేండ్ల కింద రాష్ట్రం ఏర్పడ్డప్పుడు హైదరాబాద్‌లో చాలా మందికి అనుమానాలు ఉండే. ఏం జరుగుతది, ఎట్లయితది అని.. హైదరాబాద్ మహానగరం విశ్వనగరంగా ఎదిగే క్రమంలో ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాం. కరెంట్ సమస్యను పరిష్కరించుకున్నాం. 14 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చే పరిస్థితి నుంచి, ట్యాంకర్లు బుక్ చేసుకునే పరిస్థితి నుంచి ఇవాళ రోజు తప్పించి రోజు నీళ్లు ఇచ్చుకుంటున్నాం. పంచాయితీలు, కొట్లాటలు అయితయి అనుకున్నకాడి నుంచి ఈ పదేండ్లలో కర్ఫ్యూ లేదు. చాలా పటిష్టంగా శాంతి భద్రతలు కాపాడుకున్నాం. హైదరాబాద్‌ను ప్రపంచంలోనే ఒక మంచి నగరంగా తీర్చిదిద్దుకునేందుకు ఎన్నో కొత్త వసతులు, కార్యక్రమాలు చేసుకుంటున్నాం అని కేటీఆర్ తెలిపారు.హుస్సేన్ సాగర్ వెంట పోతుంటే కొత్త నగరానికి వచ్చినట్లుంది అని కేటీఆర్ పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్, అమరుల స్మారకం.. ఎంతో అద్భుతంగా ఆ ప్రాంతాన్ని మార్చాయి. ఖైరతాబాద్ నియోజకవర్గం గొప్పగా మారింది. పంజాగుట్ట స్మశాన వాటిక ఇదివరకు ఎట్ల ఉండే.. ఇప్పుడు ఎట్ల ఉందో చూడండి. రోడ్లు బాగయ్యాయి. మోరిలు, పార్కులు బాగా చేసుకుంటున్నాం అని తెలిపారు.హైదరాబాద్ నగరంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ వంటి కట్టడాలు అద్భుతంగా ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. అమెరికా, న్యూయార్కులా.. జోర్దార్ తయారైంది హైదరాబాద్. హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్, గబచ్చిబౌలి వెళ్తే హైదరాబాద్‌లో ఉన్నానా..? అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్నానా? అనే అనుభూతి కలిగిందని రజనీకాంత్ కూడా అన్నారు. బీజేపీ ఎంపీ సన్నీడియోల్ కూడా హైదరాబాద్‌కు వచ్చి.. హైదరాబాద్ ఎంత అందంగా అయిందంటే ఇల్లు కొనుక్కొని ఇక్కడే ఉండబుద్ది అవుతుందన్నారు. తెలుగు యాక్టర్ లయ కూడా.. అమెరికాలో ఉండే లాస్ ఏంజెల్స్, పెద్ద పెద్ద నగరాల కంటే హైదరాబాదే బాగుంది.. జోర్దార్‌గా ఉందని కితాబిచ్చారు. ఇటీవలే గంగవ్వను కలిశాను. దుబాయ్ పోయాను అని చెప్పింది గంగవ్వ.. దుబాయ్ ఎట్ల ఉందని అడిగాను.. మన హైదరాబాద్‌లాగా ఉందని చెప్పింది. అందరికీ అర్థమవుతుంది కానీ.. కాంగ్రెస్, బీజేపోళ్లకు హైదరాబాద్ అభివృద్ధి అర్థమైతలేదు. అప్పుడే పుట్టిన పసిగుడ్డును చూసుకున్నట్టే తెలంగాణను కేసీఆర్ చూసుకుంటున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు.