అయ్యప్పను దర్శించుకుంది .. 17మంది మహిళలే


– నూతన జాబితాను రిలీజ్‌ చేసిన కేరళ పోలీస్‌శాఖ
తిరువనంతపురం, జనవరి24(జ‌నంసాక్షి) : పదేళ్ల నుంచి 50ఏళ్ల మధ్యవయసు ఉన్న 51మంది మహిళలు శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకున్నట్లు ఇటీవల కేరళ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు జాబితా సమర్పించిన విషయం తెలిసిందే. అయితే ఆ జాబితాను సవరిస్తూ గురువారం ఆ రాష్ట్ర పోలీసులు కొత్త జాబితాను రిలీజ్‌ చేశారు. 10ఏళ్ల నుంచి 50ఏళ్ల వయసు మధ్య ఉన్న మహిళలు కేవలం 17మంది మాత్రమే దర్శించుకున్నట్లు పోలీసులు చెప్పారు. గతంలో సుప్రీంకు సమర్పించిన జాబితాలో నలుగురు మగవాళ్ల పేర్లు కూడా ఉన్నాయి. అదే జాబితాలో 50ఏళ్లు దాటిన 30మంది మహిళల పేర్లు ఉన్నాయి. నూతనంగా ఏర్పడిన హైలెవల్‌ కమిటీ ఆ పేర్లను తొలగించి కొత్త జాబితాను ప్రకటించింది. ప్రభుత్వ నిర్లక్ష్యం, తొందరపాటు వల్ల మొదటి జాబితాను రిలీజ్‌ చేసినట్లు అంగీకరించారు. అయితే మొదట సమర్పించిన జాబితా పేర్లలో వారి ఆధార్‌తో పాటు ఫోన్‌ నెంబర్లు కూడా ఉన్నాయి. ఆ నెంబర్లకు విూడియా సంస్థలు ఫోన్‌ చేయడంతో ఆ వివాదం బయటపడింది. దీంతో హైలెవల్‌ కమిటీ మళ్లీ కొత్త జాబితాను తయారు చేసింది. అన్నివయసుల మహిళలు అయ్యప్పను దర్శించుకోవచ్చు అని సుప్రీం తీర్పు ఇచ్చింది. దీంతో పలువురు మహిళలు అయ్యప్పను దర్శించుకొనేందుకు శబరిమల వెళ్లారు. సుప్రీం తీర్పుకు వ్యతిరేఖంగా ఆందోళనకారులు మహిళలు రాకుండా అడ్డుకున్నారు. పోలీసులు, ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించినప్పటికీ ఎక్కువ మంది మహిళలు అయ్యప్పను దర్శించుకోలేక పోయారు.