అవతరణ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

పాఠశాలల్లో సాంస్కృతికుత్సవాలు
వరంగల్‌,మే28(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి చందూలాల్‌  తెలిపారు. ఈ మేరకు ప్రబుత్వం అన్‌ఇన ఏర్పాట్లు చేసిందన్నారు పాఠశాలల్లో జూన్‌ 2న అవతరణ వేడుకలను నిర్వహించాలని ఆదేశించారు.  అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేయాలన్నారు. వేడుకలను జూన్‌ 1 నుంచి 3వ తేదీ వరకు మండల, డివిజన్‌, జిల్లా స్థాయిలో ఉత్సవాలను నిర్వహించాలని ఆదేశించారు. మూడు రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. అవతరణ వేడుకల సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించాలన్నారు. ప్రభుత్వ దవాఖానలు, అనాథ, వృద్ధుల ఆశ్రమాల్లో పండ్లు, స్వీట్లు పంపిణీ చేయాలని సూచించారు. జిల్లాలో వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన 12 మందిని గుర్తించి నగదు అవార్డులు అందించాలన్నారు. తెలంగాణ ఫుడ్‌ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేసి తెలంగాణ రుచులను ప్రజలకు అందించాలన్నారు. జిల్లాలో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, స్వశక్తి సంఘాల మహిళలు, కళాకారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నదని అన్నారు.పేద ప్రజల కష్టాలు తీర్చడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పాలన ముందుకు సాగుతున్నదన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంక్షేమ పథకాలను అగ్రభాగంలో నిలిపారన్నారు. పేదింటి ఆడపిల్లల పెండ్లిళ్లు చేసేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలతో ఇంటి పెద్దకొడుకులా ముందుంటున్నారన్నారు. బీడు వారిన భూములను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా కోటి ఎకరాల సాగునీరు అందించడానికి ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుపుతున్నారన్నారు.  ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఎంతో మంది రైతులు వారి విలువైన భూములు, ఇండ్లను త్యాగం చేశారన్నారు. భూ నిర్వాసితులను ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని తెలిపారు. ఇతర ప్రభుత్వం చేస్తున్న ఈ మహా సంక్షేమ యజ్ఞాన్ని విజయవంతం చేసేందుకు అందరూ భాగస్వాములవ్వాలన్నారు.