అవినీతి మంత్రుల అరెస్టుకు కేబినేట్‌ అనుమతించదు

అ తెలంగాణ అడ్వకేట్లపై విచారణకు అనుమతిస్తారా ?
అ టీ అడ్వకేట్‌ జేఏసీ ఫైర్‌
హైదరాబాద్‌, డిసెంబర్‌ 15 (జనంసాక్షి) : అవినీతి మంత్రులను కాపాడేందుకు యత్నించే సీమాంధ్ర పాలకులు న్యాయమైన ఆకాంక్షను వ్యక్తం చేసిన తెలంగాణ లాయర్ల అరెస్టుకు ఎలా అనుమతిస్తారని టీ లాయర్ల జేఏసీ ప్రతినిధులు నిలదీశారు. శనివారం నగరంలోని గాంధీభవన్‌ ఎదుట వారు ఆందోళననిర్వహించారు. ఈనెల 28న కేంద్రం నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ ఒకే వైఖరి చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. తెలంగాణపై వెంటనే తేల్చాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించే కాంగ్రెస్‌ మేధోమదనంలో తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మీడియాతో మాట్లాడారు. అవినీతి, అక్రమాలకు పాల్పడి ప్రజాధనాన్ని దోచుకున్న మంత్రులకు బాసటగా నిలుస్తున్న కేబినెట్‌ నాలుగున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవం కోసం పాడుతున్న వారిని అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా సీమాంధ్ర పాలకులు తీరును మార్చుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.