అసెంబ్లీలో నాలుగోరోజూ రగడే
సభ నుంచి టిడిపి సభ్యుల సస్పెన్షన్
చంద్రబాబు ఫేక్ లీడర్ అంటూ నాని వ్యాఖ్యలు
అమరావతి,డిసెంబర్3 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో నాలుగో రోజు కూడా రగడ నెలకొంది. అలాగే టిడిపి సభ్యుల సస్పెన్షన్ కొనసాగింది. వాడీవేడీగా విమర్శలు,ప్రతి విమర్శలు సాగాయి. గురువారం నాడు సంక్షేమ పథకాలపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానాలిచ్చారు. ఈ క్రమంలో పెన్షన్ విషయంపై సుధీర్ఘ చర్చ జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చాక రూ.3000 పెన్షన్ ఇస్తామన్నారు..? అసలేమైంది..? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన మాటలను వైసీపీ సభ్యులు, మంత్రులు తప్పుబట్టారు. అంతేకాదు.. ఆయనపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు కూడా ఇచ్చారు.
ఈ క్రమంలో టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేయగా.. ఎమ్మెల్యే నిమ్మలపైకి వైసీపీ ఎమ్మెల్యేలు దూసుకెళ్లారు. పక్కనే ఉన్న అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, రామకృష్ణ.. నిమ్మలకు రక్షణగా నిలిచారు. ఇలా సభలో రగడ జరుగుతుండగానే.. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. కాగా.. ఇవాళ సభలో రామానాయుడు చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు ఫేక్ ప్రతిపక్ష నేత, టీడీపీ ఫేక్ పార్టీ అంటూ పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని పైర్ అయ్యారు. పొత్తు లేకుండా పోటీ చేయలేని వ్యక్తికి తమ నాయకుడిని విమర్శించే అర్హత లేదని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు చేసిన విమర్శలను మంత్రి తిప్పికొట్టారు. పారిపోయేవాళ్లు ఎవరో ప్రజలందరికి తెలుసు. చంద్రగిరి వదిలి కుప్పం పారిపోయింది చంద్రబాబు కాదా. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయారు. ఇక కరోనా రాగానే కాల్వగట్టు నుంచి హైదరాబాద్‌కు పారిపోయారు. ఆయనో ఫేక్ ప్రతిపక్షనేత అంటూ చురకలు అంటించారు. చంద్రబాబు పాలనలో ఒక్క పెన్షన్ కూడా పెంచలేదు. టీడీపీ హయాంలో ఎవరైనా చనిపోతేనే కొత్త పింఛన్ ఇచ్చేవారు.. కానీ సీఎం జగన్ వచ్చాక అర్హులందరికీ పింఛన్లు ఇస్తున్నాం. ఒకటో తారీఖునే ఠంచనుగా పింఛన్ అందిస్తున్నాం’ అని తమ ప్రభుత్వ తీరును వివరించారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అని మంత్రి బొత్స విమర్శించారు. సొంతంగా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన ధీరుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ప్రజామోదంతో సీఎం అయ్యారు. వెన్నుపోటు రాజకీయాలు ఆయనకు తెలియవు. చంద్రబాబు మెప్పు కోసమే టీడీపీ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే సభను తప్పదోవ పట్టించాలని చూస్తున్నారు’ అని మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ సభ్యుల తీరును విమర్శించారు.
సీఎం జగన్‌పై జనసేన ఎమ్మెల్యే ప్రశంసలు
పేదల పెన్షన్ల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు.
అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు మాసినక పరిస్థితి సరిగా లేదని విమర్శించారు. పెన్షన్ల గురించి మాట్లాడే హక్కు వైఎస్సార్‌కు, ఆయన తనయుడు వైఎస్ జగన్‌కే ఉందన్నారు. ‘జగన్‌లాంటి నాయకుడు ఉండటం మన అదృష్టం. పేదల ఇంటి కల సాకారం చేసింది అప్పట్లో వైఎస్‌ఆర్.. ఇప్పుడు జగనే. సీఎం జగన్ లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించారు. సచివాలయం ద్వారా ప్రతి గ్రామంలోనూ 30 నుంచి 40 మంది వలంటీర్లను నియమించారు. వలంటీర్ వ్యవస్థ దేశంలోనే అత్యుత్తమ ఆలోచన అని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇళ్ల కోసం పేదలు ఇంతకుముందు ఎమ్మెల్యేల ఇంటి ముందు బారులు తీరేవారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎందుకంటే పేదల కోసం సీఎం జగన్ లక్షల ఇళ్లు ఇస్తున్నార’ని రాపాక వరప్రసాద్ అన్నారు.
నాలుగోరోజూ టిడిపి సభ్యుల సస్పెన్షన్
నాలుగోరోజు టీడీపీ సభ్యులు శాసనసభలో గందరగోళం సృష్టించారు. ఎమ్మెల్యే పి.రాజన్నదొర మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు అడ్డుతగిలారు. ఎంత నచ్చజెప్పినా వినకుండా నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలింగించారు. దీంతో వెలగపూడి రామకృష్ణబాబు, వీరాంజనేయులు, అచ్చెన్నాయుడు, మంతెన రామరాజు, జోగేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్‌లను సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. సస్పెండ్ అయిన సభ్యులతో పాటు మిగతా టీడీపీ ఎమ్మెల్యేలు, చంద్రబాబు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.