అహింసాయుత ఉద్యమం గాంధీ మార్గం
అదే మార్గంలో రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్
-మంత్రి జగదీష్ రెడ్డి
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
అహింసాయుత మార్గం తోటే మహాత్మాగాంధీ స్వాతంత్ర్యం సాధించారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణా రాష్ట్రాన్ని సాధించారని ఆయన తెలిపారు.భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన క్రీడా పాటిల ముగింపు ఉత్సవాలకు మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మేకల అభినవ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్రీడా పోటీల విజేతలకు ఆయన బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్రా సుధాకర్ మున్సిపల్ కమిషనర్ కే వి రమణా చారి ప్రభృతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రను మూడో తరానికి తెలియ చెప్పాలన్న సంకల్పంతోటే ముఖ్యమంత్రి కేసీఆర్ వజ్రోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టారన్నారు.780 సంస్థానాలుగా ఉన్న భారతదేశం లో ఐకమత్యం లేక పోవడం ,వర్ణ వ్యవస్థ తో విడి పోవడంతో అతి చిన్న దేశాలు కుడా భారతదేశం పై దండ యాత్ర సాగించాయన్నారు.అటువంటి పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా లో బారిస్టార్ విద్యను పూర్తి చేసుకున్న మహాత్మాగాంధీ దేశానికి చేరుకుని భిన్నత్వంలో ఏకత్వం సాధించి దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టారన్నారు.ఆ స్వాతంత్ర్య ఫలాలు అనుభవిస్తున్న నేటి తరానికి స్వాతంత్ర్య సంగ్రామ అనుభవాలు తెలియవన్నారు.స్వేచ్ఛ లేనప్పుడే స్వాతంత్ర్యం గురించి తెలుస్తోందని అటువంటి చరిత్రను తెలియ జెప్పడం కోసమే వజ్రోత్సవ వేడుకల సారాంశమన్నారు. అటువంటి స్ఫూర్తిని నేటి తరం అలవర్చుకోవాలి అని ఆయన యువతకు ఉపదేశించారు.క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఆయన బహుమతులు అందజేశారు.