ఆగమేఘాల విూద అనువైన ప్రాంతంగా గాంధీనగర్‌ గుర్తింపు

సిఎం కెసిఆర్‌ హరితహారం కోసం పక్కాగా ఏర్పాట్లు

నేడోరేపో ఖరారు కానున్న పర్యటన తేదీలు

భూపాలపల్లి,జూలై11(జ‌నం సాక్షి): సీఎం కెసిఆర్‌ నాలుగో విడత హరితహారం కార్యక్రమంను ప్రారంభించేందుకు జిల్లాను ఎంచుకోవడంతో కార్యక్రమాన్ని ప్రారంభించే అనువైన స్థలం ఎంపికలో అధికారులు నిమగ్నమయ్యారు. నాలుగో హరితహారాన్ని సీఎం ప్రారంభించడానికి గాంధీనగర్‌ను అనువైన ప్రదేశంగా గుర్తించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా నుంచి సీఎం కేసీఆర్‌ నాలుగో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ ఎస్‌కే జోషి ప్రకటించారు. సభాస్థలాన్ని చదును చేసి 25వేల మంది ప్రజలు పట్టేలా ఏర్పాట్లు చేయాలన్నారు. రేయిన్‌ఫ్రూఫ్‌ టెంట్లను వాడాలని స్పీ కర్‌ అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించ నున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. సీఎం నాలుగో విడత హరితహారం కార్యక్రమంను జిల్లాలో ప్రారంభించనున్న సందర్భంగా కలెక్టర్‌ పోలీస్‌, రెవెన్యూ, రవాణా, పంచాయతీ, ఆర్‌అండ్‌బీ, విద్యాశాఖ అధికారులతో సవిూక్షించారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు వివిధ శాఖల వారీగా చే పట్టాల్సిన పనులపై సవిూక్షించి ఆదేశాలు జారీ చేశారు. ఘనపూర్‌ మండలం గాంధీనగర్‌, మైలారం, రేగొండ మండలం పాండవుల గుట్ట ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించామని, స్థలాల ఎంపిక పూరైన వెంటనే హెలికాప్టర్‌ దిగడానికి హెలిప్యాడ్‌ను, హెలిప్యాడ్‌ నుంచి మొక్కలు నాటే ప్రాంతానికి అప్రోచ్‌ రోడ్డును, మొక్కలు నాటే స్థలం నుంచి బహిరంగ సభ జరిగే ప్రదేశానికి రోడ్డు సిద్దం చేయాలన్నారు. బహిరంగ సభకు స్టేజీని, బారీకేడ్లను సిద్ధం చేసుకోవాలని ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌ ఇంజినీర్లను ఆదేశించారు. కార్యక్రమం మొత్తం భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. దాదాపు 10 వేల మొక్కలు నాటనున్నందున ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులను తీసుకురావాలని జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు. విద్యార్థులను కార్యక్రమ స్థలానికి తీసుకురావడానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని జిల్లా రవాణాశాఖ అధికారి రవీందర్‌ను ఆదేశించారు. పండగ వాతావరణాన్ని తలపించేలా సీఎం కార్యక్రమాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.

ఈ నేపథ్యంలో కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ కలెక్టరేట్‌లో జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, అటవీ, రవా ణా, ఆర్‌అండ్‌బీ, పోలీసు, పంచాయతీరాజ్‌, విద్యాశాఖ

తదితర శాఖల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. సీఎం కేసీఆర్‌ పాల్గొనే కార్యక్రమం విజయవంతం కోసం చర్చించారు. నాలుగో విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ జిల్లాలో ప్రారంభించనున్నందున సక్సెస్‌ కోసం ప్రతి ఒకరు పని చేయాలని కలెక్టర్‌ అన్నారు. కలెక్టర్‌ అధికారులతో కలిసి రాత్రి గాంధీనగర్‌ గ్రామానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి మొక్కలు నాటే, హెలిప్యాడ్‌, బహిరంగ సభ స్థలి లెవలింగ్‌ పనులను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. రాత్రి బాగ పొద్దుపోయే వరకు కలెక్టర్‌ గాంధీనగర్‌ వద్దే ఉన్నారు. సీఎం కేసీఆర్‌ జిల్లాకు వచ్చే తేదీ నేడో రేపో ఖరారయ్యే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. అధికార యంత్రాంగం పూర్తిగా ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లలో తలమునకలైంది.

—-