ఆజ్మీర్‌కు పాక్‌ పర్యాటకులకు వీసా నిరాకరణ

ఇస్లామాబాద్‌,మార్చి5(జ‌నంసాక్షి): అజ్మీర్‌ దర్గాలో ఉర్సు ఉత్సవాల సందర్భంగా పాకిస్థాన్‌ భక్తులకు భారత్‌ వీసాలు నిరాకరించిందని పాక్‌ మంత్రి సాహిబజ్దా నూర్‌ అల్‌ హఖ్‌ ఖాద్రి చెప్పారు. ఈ నెల 7వతేదీన జరగనున్న అజ్మీర్‌ దర్గా ఉత్సవాల్లో పాల్గొనేందుకు 500 మంది పాకిస్థానీ భక్తులకు భారత్‌ వీసాలు ఇవ్వలేదని మంత్రి ఆరోపించారు. పుల్వామా ఉగ్ర దాడి అనంతరం భారత వాయుసేన ఉగ్ర శిబిరాలపై దాడుల వల్ల ఇండో -పాక్‌ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్‌ సందర్శనకు పాక్‌ భక్తులకు వీసాలు నిరాకరించిందని మంత్రి ఆరోపించారు. గత సంవత్సరం 503 మంది పాక్‌ భక్తులకు అజ్మీర్‌ దర్గా సందర్శనకు భారత్‌ వీసాలు జారీ చేసింది. కాగా ఈ ఏడాది వీసాల కోసం 400 మంది పాక్‌ భక్తులు
దరఖాస్తు చేసుకోగా, 190 మందికి భారత రాయబార కార్యాలయం వీసాలు జారీ చేసిందని సమాచారం. ప్రతి యేడు లాగే ఈ ఏడాది కూడా పాక్‌ భక్తులందరూ అజ్మీర్‌ దర్గాను సందర్శించుకునేలా వీసాలు జారీ చేయాలని పాక్‌ మంత్రి ఖాద్రి కోరారు.