ఆదివాసీల హక్కుల కోసం పోరాటమే శరణ్యం

ఆదిలాబాద్ ఎంపి సోయం బాబురావు

జూలూరుపాడు, ఆగష్టు 9, జనంసాక్షి: ఆదివాసీల హక్కుల పరిరక్షణ, సాధన కోసం పోరాటమే శరణ్యమని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాబురావు పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను మండల కేంద్రంలో ఆదివాసీలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని పాపకొల్లు క్రాస్ రోడ్డు వద్ద ముందుగా ఆదివాసీ జెండాను ఎగురవేశారు. అనంతరం అక్కడనే ఏర్పాటు చేసిన కొమరం భీం విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాయిబాబా ఆలయం వద్ద నుంచి మండల కేంద్రం వరకు ఆదివాసీలు భారీ ప్రదర్శనతో స్వాగతం పలికారు. ఆదివాసీ మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆదివాసీల ఐక్యత వర్ధిల్లాలి అంటూ యువత నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ సోయం బాబురావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల హక్కులను హరిస్తుందని మండిపడ్డారు. పోడు భూములు ఆదివాసీలకు అనాదిగా జీవనాధారమని, అటువంటి భూములపై ఆదివాసీలకు సర్వ హక్కులు ఉన్నాయని అన్నారు. పోడు భూముల పరిరక్షణ కోసం ఆదివాసీలు పోరాటం చేయాల్సిందేనని చెప్పారు. జీవన పోరాటంలో భాగంగా అవసరమైతే ప్రభుత్వంపై తిరగబడాలని పిలుపునిచ్చారు. పోడు భూములకు హక్కులు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలకు తీరని అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాలకు చెందిన పలువురు ప్రముఖులు, ఆదివాసీలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.