ఆధార్‌ లేదని అడ్మిషన్‌ నిరాకరించొద్దు

న్యూఢిల్లీ : విద్యార్థులకు ఆధార్ సంఖ్య లేకపోయినా పాఠశాలల్లో ప్రవేశం కల్పించవచ్చునని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) స్పష్టం చేసింది. ఆధార్ సంఖ్య లేదనే కారణాన్ని చూపుతూ విద్యార్థులకు ప్రవేశాన్ని నిరాకరించరాదని వివరించింది. ఇటువంటి కారణాన్ని చూపి, ప్రవేశాన్ని తిరస్కరించడం చెల్లుబాటు కాదని తెలిపింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఈ మేరకు లేఖలు రాసింది. ఆధార్ సంఖ్య లేదనే కారణంతో పాఠశాలల్లో విద్యార్థులకు ప్రవేశం కల్పించడం లేదనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చింది. ఆధార్ లేనంత మాత్రానికి బాలలు తమ హక్కులను, ప్రయోజనాలను కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.
పాఠశాలల యాజమాన్యాలు స్థానిక బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, రాష్ట్ర విద్యా శాఖ, జిల్లా పరిపాలనా యంత్రాంగాలను సంప్రదించి, తమ ప్రాంగణాలలో ఆధార్ నమోదు, నవీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసేవిధంగా చొరవ తీసుకోవాలని కోరింది.