‘ఆయుష్మాన్‌ భారత్‌’కు రంగంసిద్ధం

– నేడు ఎర్రకోట సాక్షిగా ప్రకటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ?
– దేశంలో 10కోట్ల మందికి పైగా లబ్ధి
న్యూఢిల్లీ, ఆగస్టు14(జ‌నం సాక్షి) : ఆయుస్మాన్‌ భారత్‌కు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మేరకు నేడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ప్రకటనతో దేశ వ్యాప్తంగా 10కోట్ల మందికిపైగా లబ్ధి చేకూరనుంది.. స్వాతంత్య దినోత్సవం సందర్భంగా బుధవారం ఎర్రకోట పైనుంచి ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ‘జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం-ఆయుష్మాన్‌ భారత్‌’ (ఏబీ-ఎన్‌హెచ్‌పీఎస్‌)ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకాన్ని వచ్చే నెల చివరి వారం నుంచి అమలు చేయనున్నట్లు సమాచారం. దేశంలోని 10 కోట్లకు పైగా పేద కుటుంబాలకు ఆరోగ్య భద్రత కింద సంవత్సరానికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. గ్రామాల్లో నివసించే 8.03 కోట్ల కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో నివసించే 2.33 కోట్ల కుటుంబాలు దీని ద్వారా లబ్ధిని పొందనున్నాయి. మొత్తానికి దేశంలోని 50 కోట్ల మందికి ఈ ప్రయోజనాలు అందనున్నాయి. దేశంలోని 22 రాష్ట్రాల్లో త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉందని ఓ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. పంజాబ్‌, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీలో ఈ పథకం ప్రారంభంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ పథకంలో భాగస్వామి కావడానికి ఒడిశా అంగీకరించలేదు. ఆయుష్మాన్‌ భారత్‌ కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.10,000 కోట్లు కేటాయించింది. ప్రపంచంలోనే ప్రభుత్వ అతిపెద్ద ఆరోగ్య రక్షణ బీమా పథకంగా ఇది నిలవనుంది. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో ఈ పథక ప్రయోజనాలు పొందడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలవుతోన్న సీజీహెచ్‌ఎస్‌ కన్నా ఈ పథకం లబ్ధిదారులు అధిక ప్రయోజనాలు అందుకోవచ్చు. ఆయుష్మాన్‌ భారత్‌ కోసం ప్రతి ఆసుపత్రిలో ‘ఆయుష్మాన్‌ మిత్ర’ పేరిట ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేస్తారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన ఈ పథక లబ్ధిదారులు ముందుగా ఆసుపత్రిలోని ‘ఆయుష్మాన్‌ మిత్ర’ కౌంటర్‌ను సంప్రదించి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు.