ఆస్పత్రుల్లో ఇద్దరు గోవా మంత్రులు

మంత్రి పదవుల నుంచి తొలగింపు
పనాజీ,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): గోవాలో మనోహర్‌ పారికర్‌ క్యాబినేట్‌ నుండి ఇద్దరు మంత్రులను తొలగించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం వెల్లడించింది. బిజెపి నేతలు ప్రాన్సిస్‌ డిసౌజా, పాండురంగ్‌ మదకైకర్‌లు గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో ప్యాంక్రియాటిక్‌ అనారోగ్యం కారణంగా ముఖ్యమంత్రి పారికర్‌ చికిత్స పొందుతున్న సమయంలో మంత్రుల తొలగింపు నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. పట్టణ అభివృద్ధి శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న డిసౌజా, విద్యుత్‌ శాఖ మంత్రి పాండురంగ్‌లను మంత్రివర్గం నుంచి తొలగించినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ప్రస్తుతం డిసౌజా ఆమెరికాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, జూన్‌లో బ్రెయిన్‌ స్టోక్ర్‌ రావడంతో పాండురంగ్‌ ముంబయిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి స్థానాల్లో బిజెపి నేతలు నీలేష్‌ కాబ్రల్‌, మిలింద్‌ నాయక్‌లు సోమవారమే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయున్నారని సమాచారం. అయితే చికిత్స పొందుతున్న సిఎంను తొలగించాలని కరాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.