ఆ హెలికాప్టర్‌లో ఉంది మేమే
– నిబంధనలు ఉల్లంఘించామని తెలియదు
– కాల్పులు జరుగుతున్నాయని తెలిసి గమ్యం మార్చాం
– అవి భారత్ జరిపిన కాల్పులేనని ల్యాండ్ అయ్యాక తెలిసింది
– పాక్ పర్యాటక మంత్రి ముస్తాక్
ఇస్తామాబాద్, అక్టోబర్1(జనంసాక్షి) : నిబంధనలు ఉల్లంఘించి భారత గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ హెలికాప్టర్‌పై భారత సైనికులు ఆదివారం కాల్పులు జరిపిని విషయం తెలిసిందే. ఈ ఘటనపై పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) పర్యాటక మంత్రి ముస్తాక్ మిన్‌హాస్ సోమవారం స్పందించారు. ఆ సమయంలో తను హెలికాప్టర్‌లోనే ఉన్నానని, తనతో పాటు పీఓకే ప్రధాన మంత్రి రాజా ఫరూక్ హైదర్ ఖాన్, ఆయన భద్రతాధికారులు, ప్రొవిన్స్ విద్యాశాఖ మంత్రి ఇఫ్తికర్ గిలానీలను ఉన్నారని తెలిపారు. నిజానికి ఎయిర్‌స్పేస్ నిబంధనలు ఉల్లంఘించామని మాకు తెలియదన్నారు. మాపైకి కాల్పులు జరుగుతున్నాయని తెలుసుకున్నామని, మాగమ్యం చేరిన తరువాత ఆ కాల్పులు భారత్ నుంచి వచ్చాయని తెలిసిందని అన్నారు. ఆదివారం మధ్యాహ్నం 12.13 గంటల ప్రాంతంలో పూంచ్ జిల్లాలోని గుల్పూర్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ హెలికాప్టర్ ఒకటి భారత గగనతలంలోకి ప్రవేశించింది. అప్రమత్తంగా ఉన్న వాయుగస్తీ దళాలు తేలికపాటి ఆయుధాలతో కాల్పులు జరపడంతో ఆ లోహవిహంగం వెనుదిరిగింది. ఈ ఘటనతో భారత్, పాక్ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా.. ఈ ఘటనపై స్పందించిన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్.. ఆ హెలికాప్టర్‌లో ఎలాంటి ఆయుధాలు లేవని చెప్పారు. కాగా.. ఈ హెలికాప్టర్ అనుకోకుండానే భారత గగనతలంలోకి ప్రవేశించి ఉంటుంది అని మేజర్ జనరల్(రిటైర్డ్) అశ్వనీ సివాచ్ అభిప్రాయపడుతున్నారు. నావిగేషన్ సమస్యల వల్ల ఇలా జరిగి ఉండొచ్చని ఆయన ఓ విూడియాతో మాట్లాడుతూ అన్నారు. కాగా సోమవారం స్పందించిన పర్యాటక మంత్రి ఆ హెలికాప్టర్‌లో ఉంది మేమేనని, తాము భారత్ సరిహద్దు ప్రాంతాల్లోకి వచ్చినట్లు తమకు తెలియదని అన్నారు.