ఇంకా త‌గ్గ‌నున్న‌బంగారం ధ‌ర‌

goldపెరుగుట విరుగుట కొరకే అన్న మాట బంగారం విషయంలో ఇప్పుడు అక్షర సత్యమవుతోంది. నిన్నమొన్నటిదాక పట్టపగ్గాల్లేకుండా పరుగులు పెట్టిన పసిడి ధరలు రోజురోజుకూ పతనమవుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలకు తోడు.. ధర ఇంకా తగ్గుతుందన్న ఆశతో జనం కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారు. ఇంతకీ బంగారం రేటు ఇంతగా పతనమవడానికి కారణమేంటి? పసిడి ధర ఇంకా తగ్గుతుందా? గోల్డ్‌ లో ఇన్వెస్ట్‌ చేయడం మంచిదేనా?
ఆకాశంలో మెరుపులు.. నేల చూపులు
కోటీశ్వరుడి నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరికీ ఎంతో ప్రీతిపాత్రమైంది బంగారం. ఇక మహిళలకు దానిపైనున్న మోజు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే, గత ఏడేళ్లుగా పుత్తడి ధర రేసుగుర్రంలా పరిగెత్తి సామాన్యున్ని కలవరపెట్టింది. కానీ, ఇప్పుడు సీన్‌ రివర్సైంది. బంగారానికి బ్యాడ్‌ టైం స్టార్టయింది. నిన్న మొన్నటి వరకు కొండెక్కి కూర్చున్న పుత్తడి ధర ఇప్పుడు నేల చూపులు చూస్తోంది. కొనేవారు లేక పసిడికాంతులు వెలవెలబోతున్నాయి. అనూహ్య రీతిలో బంగారం ధర తగ్గుతున్నా పడుచు యువతుల నుంచి పండు ముసలి వరకు ఎంతో ప్రీతిపాత్రమైన బంగారం కొనేందుకు ఇప్పుడు ఎవరూ ముందుకు రావడంలేదు. ఇంకా తగ్గుతుందని- అప్పుడు కొనుక్కోవచ్చనే ఆలోచన తప్ప ఇప్పటికిప్పుడు బంగారం కొనేందుకు సగటు మనిషి ముందుకు రావట్లేదు. ఫలితంగా పసిడి ధరలు ఇప్పటికే భారీగా పతనమయ్యాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 25 వేలు, 22 క్యారెట్ల ఆర్నమెంట్‌ గోల్డ్‌ 10 గ్రాములు రూ. 23,500ల దిగువకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ట్రాయ్‌ ఔన్స్‌ రేటు 1,090 డాలర్ల దగ్గర బలహీనంగా తచ్చాడుతోంది. ఇది వెయ్యి డాలర్ల కన్నా తగ్గే అవకాశమూ లేకపోలేదని మార్కెట్‌ ఎనలిస్టులు అంటున్నారు.
బంగారం వినియోగంలో రెండోస్థానం
ప్రపంచంలో బంగారం వినియోగంలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. మనదేశంలో మహిళలకు గోల్డ్‌ మీదున్న ఇంట్రస్టే దీనికి ప్రధాన కారణం. భారత్‌ లో పెట్టుబడి రూపంలో కన్నా ఆభరణాల కోసం పసడి వినియోగం ఎక్కువ. అంతర్జాతీయ పరిణామాలు, డిమాండ్‌ పెరగడంతో మూడేళ్ల క్రితం తులం బంగారం ధర 33 వేల రూపాయలు పలికిందంటే దానికున్న క్రేజ్‌ ఎలాంటిదో అర్థమవుతుంది. అలా సామాన్యుడికి చుక్కలు చూపిన బంగారం ధరలు ఇప్పుడు ఏకంగా పదివేల రూపాయల వరకు దిగొచ్చాయి. 2013 ఆగస్టులో రికార్డు స్థాయిలో 19వందల డాలర్లు పలికిన ట్రాయ్‌ ఔన్స్‌ పసిడి ధర ప్రస్తుతం 11వందల డాలర్ల దిగువన ట్రేడవుతోంది.
బంగారం ధర ఎందుకు పెరుగుతుంది?
ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని ఆభరణాల కోసం కొందరు, పెట్టుబడిగా మరికొందరు ఎందుకు కొంటారు? ఎందుకంటే ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ లో అత్యంత నమ్మకమైన పెట్టుబడి గోల్డ్‌. సామాన్యుల నుంచి వివిధ దేశాల సెంట్రల్‌ బ్యాంకుల వరకు పసిడిని ఇబ్బడి ముబ్బడిగా కొంటాయి. సాధారణంగా యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు తలెత్తినప్పుడు పెట్టుబడులన్నీ బంగారం వైపు పరుగులు పెడతాయి. అలాంటి సమయంలో బంగారం ధరలకు రెక్కలొస్తాయి. 1980ల్లో బంగారం ధరల్లో బుల్లిష్‌ ట్రెండ్‌ కనిపించింది. అప్పట్లో ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ లో ట్రాయ్‌ ఔన్స్‌ ధర దాదాపు 850 డాలర్లు పలికింది. ఆ తర్వాత వచ్చిన కరెక్షన్‌ తో దాదాపు 15ఏళ్లపాటు పసిడి ధరలు పతనమయ్యాయి. అయితే, 2000 సంవత్సరం నుంచి బంగారానికి మళ్లీ మంచిరోజులొచ్చాయి. ధర పట్టపగ్గాల్లేకుండా పెరగడం మొదలైంది. 2008లో వచ్చిన ఆర్థికమాంద్యం ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం, ఒకదాని తర్వాత మరొకటిగా ఐరోపా దేశాలు అప్పుల ఊబిలో చిక్కుకోవడం బంగారానికి కలిసొచ్చింది.
బంగారం ధర ఎందుకు తగ్గుతోంది?
పరిస్థితి ఇప్పుడు మళ్లీ తలకిందులైంది. అంతర్జాతీయ పరిణామాలకు తోడు పుత్తడి దిగుమతులు తగ్గించుకునేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు బంగారం వన్నె తగ్గిస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుండటం పసిడి ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లు పెంచే సూచనలు ఉండటంతో ఇంతకాలం బంగారంలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు ఆల్టర్నేట్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ ప్లాన్స్‌ రెడీ చేసుకుంటున్నారు. మరోవైపు, బంగారం వినియోగంలో ముందున్న చైనా ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. దాదాపు మూడు దశాబ్దాల పాటు రేసుగుర్రంలా పరిగెత్తిన చైనా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం కుంటుతోంది. దీంతో అక్కడి ప్రజల ఆదాయం తగ్గింది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు చైనా సెంట్రల్‌ బ్యాంకు ఇటీవలే కొంత బంగారాన్ని విక్రయించింది. మరికొంత పసిడి అమ్మేందుకు సిద్ధమవుతోంది. దీంతో, కొనేవాళ్లు తగ్గి పసిడి సప్లై పెరిగింది. దీనికి తోడు ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గడం కూడా బంగారం ధర దిగి రావడానికి దోహదం చేస్తున్నాయి. ఇక గ్రీస్‌, ఇరాన్‌ సంక్షోభాలు పెరిగి పెద్దవవుతాయని బంగారం ధరలు మరింతపెరుగుతాయని అందరూ అనుకున్నారు. అయితే, అందుకు భిన్నంగా ఆ సమస్యలు సామరస్యంగా పరిష్కారమయ్యాయి. ఇది కూడా పసిడి ధరల్ని ప్రభావితం చేసింది.

గోల్డ్ డిపాజిట్ స్కీం
ఇక, మనదేశం విషయానికొస్తే పతనమవుతున్న పసిడి ధరలు సామాన్యుడికి కాస్త రిలీఫ్‌ నిచ్చాయి. అయితే, రేటు ఇంకా తగ్గుతుందన్న ఆశతో జనం పసిడి కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు. సాధారణంగా ఆషాఢంలో బంగారం కొనుగోళ్లు తగ్గుతాయి. ఈ ఏడాది అధికమాసం రావడం, మూడు నెలలుగా పెళ్లిళ్లు, శుభకార్యాలు లేకపోవడంతో బంగారానికి గిరాకీ తగ్గింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో గ్రామాల్లో ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. ఇది కూడా బంగారానికి డిమాండ్‌ తగ్గడానికి మరో కారణం. ఇదిలా ఉంటే క్రూడ్‌ ఆయిల్‌ తర్వాత భారత్‌ అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఇందుకోసం డాలర్ల రూపంలో భారీ మొత్తాన్ని వదులుకుంటోంది. ఈ పరిస్థితిని మార్చి విదేశీ మారక నిల్వల్ని కాపాడుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. భోషాణాల్లో దాచుకున్న బంగారాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు గోల్డ్‌ డిపాజిట్‌ స్కీంను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ పథకంలో డిపాజిట్‌దారులు తమ వద్ద ఉన్న బంగారాన్ని కాయిన్లుగా మార్చి బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకు ప్రతిఫలంగా బ్యాంకులు డిపాజిట్‌ దారులకు వడ్డీ చెల్లిస్తాయి. డిపాజిట్‌ గడువు ముగిసిన తర్వాత ఖాతాదారులకు బంగారం కావాలా లేక నగదు కావాలా అన్న అంశం కచ్చితంగా తెలపాల్సి ఉంటుంది. బంగారం కావాలన్న వారి బంగారాన్ని లాకర్‌ లోనే ఉంచి నగదు కావాలనుకున్న వారి బంగారాన్ని బ్యాంకులు విక్రయిస్తాయి. ఈ స్కీం అమల్లోకి వస్తే ఏటా దాదాపు 6వేల టన్నుల బంగారం వినియోగంలోకి వస్తుందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే తులం బంగారం ధర 20వేల కిందికి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదంటున్నారు.
బంగారం ధరలు తగ్గుతున్నా ప్రస్తుతం గోల్డ్‌ లో ఇన్వెస్ట్ చేయకపోవడమే ఉత్తమమని మార్కెట్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో కేవలం 3 నుంచి 5 శాతం వరకు మాత్రమే బంగారంలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల పతనం వినియోగదారులకు శుభవార్తే అయినా బ్యాంకులు, గోల్డ్‌ లోన్‌లు ఇచ్చే కంపెనీలకు మాత్రం గుబులు పుట్టిస్తోంది. బంగారాన్ని కుదువ పెట్టుకుని భారీగా రుణాలిచ్చిన వారు ఒక్కసారిగా గోల్డ్‌ రేటు పడిపోవడంతో తలపట్టుకుంటున్నారు. రానున్న రోజుల్లో ధర మరింత పతమవుతుందన్న వార్తలు బ్యాంకులు, ఫైనాన్స్‌ కంపెనీల యాజమాన్యాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.
ఏదేమైనా నిన్నమొన్నటి వరకు ముచ్చెమటలు పట్టించిన కనకం ఇప్పుడు కోటీశ్వరుల నుంచి కార్మికుల వరకు అందరికీ సంతోషాన్నిస్తోంది. ధరలు మరింత తగ్గితే ఎంతో కొంత బంగారం కొని దాచుకోవాలని సామాన్యుల ఆశ నిజమవ్వాలని కోరుకుందాం.