ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ ముగ్గురి మృతి
హైదరాబాద్: వరంగల్ జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో తల్లితో సహ ఇద్దరు పిల్లలు మృతి చెందారు. వరంగల్- ఖమ్మం ప్రధాన రహదారిపై నర్సింహులపేట మండలం బీరిశెట్టిగూడెం గ్రామంలో అతి వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులు బండి సునీత(35), కుమారుడు రాహుల్(15), కుమార్తె ప్రగతి(13) దుర్మరణం చెందారు. లారీ బలంగా ఢీకొట్టడంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. శిథిలాల కింద ఇరుక్కుపోయిన మృత దేహాలను గంటపాటు శ్రమించి బయటకు తీశారు. ఇంటి ముందు నిద్రిస్తున్న మరో వృద్ధురాలు తృటిలో ప్రాణాలతో బయటపడింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.