ఇండోనేషియాలో సునావిూ బీభత్సం
– 48మంది మృతి, 356మందికి తీవ్ర గాయాలు
– మరికొంతమంది గల్లంతు
– మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం
– వెల్లడించిన దేశ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ
– సహాయక చర్యలను ముమ్మరం చేసిన అధికారులు
– స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
ఇండోనేషియా, సెప్టెంబర్29(జనంసాక్షి) : ఇండోనేషియాలోని సులవెసి ద్వీపంలో సునావిూ భీభత్సం సృష్టించింది. నగర తీరం ప్రాంతాలపై ఒక్కసారిగా విరుచుకుపడింది. శుక్రవారం సాయంత్రం 6గంటల సమయంలో సముద్రగర్భంలో భూకంపం సంభవించడంతో సులవెసి తీర ప్రాంతంలో సునావిూ విరుచుకుపడింది. ఈ ఘటనలో సుమారు 48 మంది ప్రాణాలు కోల్పోగా, 356మందికి తీవ్ర గాయాలైనట్లు శనివారం ఉదయం ఆదేశ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. కాగా సులవెసి స్థానిక ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ 30మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 21 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కాగా సులవెసి ప్రాంతాల్లోని స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శుక్రవారం సులవెసి ద్వీపంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 7.5గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఇదిలా ఉంటే శనివారం ఉదయం పలు నగరంలో సునావిూ కారణంగా అలలు పది అడుగుల ఎత్తుకు ఎగసిపడ్డాయి. తీరప్రాంత నగరమైన పలులో 3,50,000 మంది జనాభా ఉన్నారు. భూకంపం, సునావిూల కారణంగా నగరంలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. భూప్రకంపనల ధాటికి పలు భవనాలు కూలిపోయాయి. సహాయక సిబ్బంది రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపడుతున్నారు. శనివారం ఉదయం సముద్ర తీరంలో కొన్ని మృతదేహాలు లభ్యమయ్యాయి. భవనాలు కుప్పకూలిన ప్రాంతాల్లో కూడా శిథిలాల కింద కొన్ని మృతదేహాలు కనిపించాయి. చాలా మంది గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సునావిూ ధాటికి తీర ప్రాంతంలోని ఇళ్లు, కట్టడాలు కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ విూడియాలో వైరల్గా మారాయి.
2004 తరువాత మళ్లీ..
2004 తర్వాత ఇండోనేషియా దీవుల్లో సునావిూ రావడం ఇదే తొలిసారి. అప్పుడు సంభవించిన సునావిూ కారణంగా దాదాపు 2,20,000 మంది ప్రాణాలు కోల్పోగా వారిలో 1,68,000 మంది ఇండోనేషియా వాసులే ఉన్నారు. 7.5 తీవ్రతతో సులవెసి ప్రాంతంలో భూకంపం సంభవించిన వెంటనే అధికారులు సునావిూ హెచ్చరికలు జారీ చేశారు. కానీ కొద్ది సేపటికే వాటిని వెనక్కి తీసుకున్నారు. అయితే అధికారులు హెచ్చరికలను వెనక్కి తీసుకున్న కాసేపటికే పౌలు నగరాన్ని సునావిూ ముంచేసింది. సునావిూ సంభవించిన విషయాన్ని అక్కడి అధికారులు ధ్రువీకరించారు.