ఇండోనేషియాలో 429కి చేరిన మృతులు

– మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
జకార్తా, డిసెంబర్‌25(జ‌నంసాక్షి) : ఇండోనేషియాలో ప్రకృతి ప్రకోపం తీరని శోకాన్ని మిగిల్చింది. అగ్నిపర్వతం బద్దలవడంతో గత శనివారం రాత్రి సునావిూ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య మంగళవారం 429కు చేరింది. మరో 1400 మందికి పైగా గాయపడ్డారు. వీరికి ఆయా ప్రాంతాల ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వీరిలో సగం మంది పరిస్థితి విశమంగా ఉందని అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు సునావిూ దాటికి ఇంకా 128మంది గల్లంతైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. వీరికోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా వీరిలో ఎవరూ సజీవంగా ఉండే అవకాశాలు లేవని, ఒకవేళ ఉన్నా.. తక్కువ మందే బతికే అవకాశాలు ఉన్నాయని స్థానిక అధికారులు వెల్లడించారు. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సునావిూ కారణంగా సుమత్రా, జావా తీర ప్రాంతాలు మృత్యుదిబ్బలుగా మారిపోయాయి. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సునావిూ ధాటికి కుప్పకూలిన ¬టళ్లు, ఇళ్ల శిథిలాల కింద చిక్కుకుపోయినవారిని బయటకు తీసేందుకు ఇండోనేసియా సైనికులు, స్వచ్ఛంద సేవకులు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. క్రాకటోవా అగ్నిపర్వతం శనివారం రాత్రి 9గంటల సమయంలో బద్దలైంది. సరిగ్గా 24 నిమిషాల తర్వాత నీటి లోపల భూమి కంపించి సునావిూకి దారితీసింది. సుమత్రా దీవి దక్షిణ తీరం, జావా పశ్చిమ తీర ప్రాంతాల్లో అలలు విరుచుకుపడ్డాయి. వారాంతం, క్రిస్మస్‌ సెలవులు కావడంతో శనివారం బీచ్‌లో పర్యాటకుల రద్దీగా ఎక్కువగా ఉంది. అదే సమయంలో సునావిూ రావడంతో ప్రాణ నష్టం భారీగా ఉందని అధికారులు చెబుతున్నారు.