ఇం‘ధన’ దోపిడీ


` ఎక్జైజ్‌ టాక్స్‌ ఆదాయంలో 33శాతం దోపిడి
` కోవిడ్‌ మునుపటితో పోలిస్తే 79శాతం బాదుడు
` కుదేలవుతున్న వినియోగదారులు
` కేంద్రసర్కారుకు కాసుల గలగల
దిల్లీ,అక్టోబరు 31(జనంసాక్షి): దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలతో వాహనదారులు అల్లాడిపోతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో వాహనాలను బయటకి తీయాలంటేనే భయపడుతున్నారు. ఈ పరిణామాల మధ్య విడుదలైన కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ నివేదిక కీలక విషయాలను బయటపెట్టింది. పెట్రోలియం ఉత్పత్తులపై విధించే ఎక్సైజ్‌ సుంకం ద్వారా వచ్చే వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో 33 శాతం పెరిగినట్లు తేలింది. కొవిడ్‌ మునుపటితో పోలిస్తే 79 శాతం ఎగబాకడం విశేషం. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) వద్ద ఉన్న ఏప్రిల్‌`సెప్టెంబరు గణాంకాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి.క్రితం ఏడాది తొలి అర్ధభాగంలో రూ.1.28 లక్షల కోట్లుగా ఉన్న ఎక్సైజ్‌ సుంకం వసూళ్లు.. ఈసారి రూ.1.71 లక్షల కోట్లకు ఎగబాకాయి. కరోనా వెలుగులోకి రావడానికి ముందు 2019, ఏప్రిల్‌`సెప్టెంబరు మధ్య ఇవి రూ.95,930 కోట్లుగా ఉన్నాయి. అప్పటితో పోలిస్తే 79 శాతం పెరుగుదల నమోదైంది. ఎక్సైజ్‌ సుంకం భారీగా పెరగడమే ఇందుకు కారణం. ఎక్సైజ్‌ సుంకం ద్వారా 2020`21లో రూ.3.89 లక్షల కోట్లు, 2019`20లో రూ.2.39 లక్షల కోట్లు వసూలయ్యాయి.వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమల్లోకి వచ్చిన తర్వాత పెట్రోల్‌, డీజిల్‌, ఏటీఎఫ్‌, సహజవాయువు పైన మాత్రమే ఎక్సైజ్‌ సుంకం విధిస్తున్నారు. క్రితం ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రథమార్ధంలో అదనంగా రూ.42,931 కోట్లు వసూలయ్యాయి. ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ ఏడాది మొత్తంలో ఆయిల్‌బాండ్లకు చెల్లించాల్సిన రూ.10,000 కోట్లతో పోలిస్తే ఇది నాలుగింతలు. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండడంతో ఇంధన గిరాకీ పెరుగుతోంది. దీంతో పెట్రోల్‌, డీజిల్‌పై విధించే ఎక్సైజ్‌ సుంకం ద్వారా వస్తున్న ఆదాయం సైతం అదే స్థాయిలో పెరుగుతోంది.