ఇచ్చిన హామీలను పూర్తిగా మరిచి ప్రజలకు మోసంచేసిన సీఎం కేసీఆర్.

– వచ్చేది బిజెపి ప్రభుత్వమే.
– బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బిజెపి నేత చంద్ర శేఖర్.

మర్పల్లి, సెప్టెంబర్ 27 (జనం సాక్షి) సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా మరిచి పాలన చేస్తున్నాడు అని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మంగళ వారం రోజున భారతీయ జనతా పార్టీ చేపట్టిన ప్రజాగోస బిజెపి భరోసా యాత్ర లో మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని భుచన్ పల్లీ, దామస్తాపూర్, కల్కోడ, పెద్దాపూర్, రావులపల్లి, తిమ్మాపూర్, కుడిగుంట, గుర్రంగట్టు తండా, కొట్లాపూర్, వీర్లపల్లి, సిరిపురం గ్రామాలలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రజల జీవితాలను వెలుగు నింపుతారని అనుకుంటే, సీఎం కేసీఆర్ గెలిచాక ఇప్పుడు అవన్నీ మరిచిపోయాడని అన్నారు. నిరుద్యోగులకు ప్రతినెల 3016/- రూపాయలు ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు, కానీ అది ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదని వారు ప్రశ్నించారు. గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని కానీ, సీఎం కేసీఆర్ ఒక రూపాయి కూడా ఇవ్వడం లేదని వారు అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందని, కరోనా వ్యాక్సినేషన్ పేద ప్రజలకు ఉచితంగా ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం చెందుతుంది అని వారు గుర్తు చేశారు. ఎక్కడ ఎన్నికలు వస్తే, అక్కడ పథకాలను విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాడని, ప్రజలంతా మా నియోజకవర్గాలలో ఎన్నికలు వస్తే బాగుండు అని అనుకుంటున్నారని, హుజరాబాద్ ఎన్నికల టైంలో దళిత బంధు పేరుతో మోసం చేయగా, ఇప్పుడు మునుగోడు బై ఎలక్షన్ను దృష్టిలో పెట్టుకొని అక్కడ డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఎవరికైనా ఇచ్చార అని ప్రశ్నించారు. కేసీఆర్ ను ఓడిస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. రాష్ట్రంలో ప్రతి మనిషి పైన కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసిందని బంగారు తెలంగాణ కాదు ఇది ఆప్పుల తెలంగాణగా మార్చారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బిజెపి వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు సదానంద రెడ్డి, బిల్కల్ విట్టల్, ప్రధాన కార్యదర్శి పాండు గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, జిల్లా నాయకులు రామేశ్వర్ రెడ్డి, బలరాం గౌడ్, మండల నాయకులు జంగం జైపాల్, సంతోష్, రెడ్డి, పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.