ఇటు చలి అటు ఎండ..


` చలికాలంలో మండుతున్న ఎండలు..
` మరోవారం పాటు ఇదే పరిస్థితి
హైదరాబాద్‌ (జనంసాక్షి): రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాధారణంగా చలికాలంలో క్రమంగా తగ్గాల్సిన ఉష్ణోగ్రతలు ఎండాకాలం మాదిరిగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఈ సమయానికి నైరుతి సీజన్‌ ముగిసి, ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలిస్తుంటాయి. సాధారణంగా ఈ సమయానికి వాతావరణం చల్లబడుతుంది.కానీ రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలను మించిపోతున్నాయి. సగటున 3`5 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండటంతో రాష్ట్రంలో వాతావరణం వేసవి సీజన్‌ను తలపిస్తోంది. వాతావరణంలో తేమ తగ్గడంతో ఉక్కపోత పెరుగుతుండగా, ఆకాశంలో మేఘాలు ఏర్పడకుండా నిర్మలంగా ఉంటుండటంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. మరో వారం రోజుల పాటు ఇదే తరహా వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడిరచింది.రాష్ట్రంలో శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే గరిష్ఠంగా ఖమ్మంలో 36.2, భద్రాచలంలో 36, ఆదిలాబాద్‌ 35.8, నల్లగొండ 35.5, నిజామాబాద్‌ 35.3, రామగుండం 35, మెదక్‌ 34.6, హనుమకొండ 34.5, హైదరాబాద్‌ 33.2 మహబూబ్‌నగర్‌ 33 డిగ్రీల సెల్సియస్‌ చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఎక్కడా వర్షపాతం నమోదు కాలేదు. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో పొడివాతావరణమే ఉంటుందని వాతావరణశాఖ వెల్లడిరచింది.