ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు

అస్టేల్రియా పర్యటనలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

సిడ్నీ,నవంబర్‌22(జ‌నంసాక్షి): ఇండో పసిఫిక్‌ ప్రాంత స్వేచ్ఛ కోసం రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. పర్యావరణ అనుకూలమైన సిద్ధాంతాలకు, క్రికెట్‌ సంబంధాలకు రెండు దేశాలు ఉత్సుకత ప్రదర్శిస్తున్నాయన్నారు. ఆస్టేల్రియా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అక్కడ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సిడ్నీ సవిూపంలో ఉన్న పర్రమట్ట సిటీలోని జూబ్లీ పార్క్‌ వద్ద గాంధీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ దేశ ప్రధాని స్కాట్‌ మారిసన్‌ కూడా పాల్గొన్నారు. మేకిన్‌ ఇండియా ప్రోగ్రామ్‌కు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. భారత్‌లో తయారైన రైలు బోగీలు ఆస్టేల్రియాకు రావడం సంతోషకరమని రామ్‌నాథ్‌ అన్నారు. వస్త్ర రంగం నుంచి ఆటోమోబైల్‌ రంగం వరకు అందర్నీ ఆకర్షిస్తున్నామన్నారు. ఆస్టేల్రియాలో అనేక భారతీయ ఐటీ సంస్థలు పెట్టుబడి పెట్టాయన్నారు. భారత్‌లోనూ విదేశీ సంస్థలు ఎఫ్‌డీఐ రూపంలో సుమారు 62 బిలియన్ల డాలర్లు పెట్టబడి పెట్టినట్లు తెలిపారు. భారత్‌ చేపడుతున్న ఆర్థిక సంస్కరణలకు ఇదే మంచి ఉదాహరణ అని ఆయన తెలిపారు. ఐపీఎల్‌ కోసం మేటి, ఖరీదైన ఆసీస్‌ ఆటగాళ్లను తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.